Begin typing your search above and press return to search.

బొత్స మీద ఏసీబీ అస్త్రం!

విద్యా శాఖ మంత్రిగా ఉన్న బొత్స అక్రమ బదిలీల విషయంలో అడ్డంగా దొరికారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   10 Jun 2024 5:19 PM GMT
బొత్స మీద ఏసీబీ అస్త్రం!
X

వైసీపీకి చెందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీద ఏసీబీ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే చెబుతున్నాయి. విద్యా శాఖ మంత్రిగా ఉన్న బొత్స అక్రమ బదిలీల విషయంలో అడ్డంగా దొరికారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

టీచర్ల బదిలీల విషయంలో బొత్స లీలలు ఇన్నీ అన్నీ కావు అని టీడీపీ నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. ఒక్కో టీచర్ నుంచి మూడు నుంచి ఆరు లక్షల దాకా బదిలీల కోసం వసూలు చేశారు అని ఆ మొత్తం అంతా కూడి కలిపితే 65 కోట్ల రూపాయల దాకా ఉంటుందని పేర్కొంటూ టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ వర్ల రామయ్య ఆధ్వర్యంలో టీడీపీ నేతలు తాజాగా ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

బొత్స విద్యా శాఖలో చేసిన అక్రమ బదిలీల నిర్వాకం మీద వారు అందులో పూర్తిగా తెలియజేశారు. ఒక వైపు ఎన్నికల కోడ్ వచ్చాక కూడా బొత్స ఈ అక్రమ బదిలీలకు తెర లేపారని వారు విమర్శించారు. ఇదిలా ఉంటే కూటమి అధికారంలోకి రాకముందే ఏసీబీ అస్త్రం ప్రయోగించడం పట్ల చర్చ సాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వం ఏసీబీని పదునైన అస్త్రంగా మార్చుకుని ఎంతో మంది టీడీపీ నేతల మీద కేసులు పెట్టింది. వారిలో అనేక మందిని అరెస్ట్ చేసింది కూడా.

ఇపుడు అదే రూట్ లో టీడీపీ కూడా సాగుతోంది అని అంటున్నారు. చేతికి మట్టి అంటకుండా వ్యవస్థల ద్వారానే ప్రత్యర్ధుల అవినీతి భాగోతాలను బయటపెట్టాలన్నదే టీడీపీ విధానంగా ఉంది అని అంటున్నారు. దీని వల్ల వైసీపీకి అవినీతి మరకలు అంటించడమే కాదు ఆయా నాయకుల పనితీరు ఏంటన్నది జనంలో చర్చకు వచ్చేలా చేయడమే అజెండాగా ఉంది అని అంటున్నారు. బొత్సను టార్గెట్ చేయడం వెనక వ్యూహం ఏంటి అన్న చర్చ కూడా సాగుతోంది.

బొత్స వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్తారు అని ప్రచారం సాగుతున్న వేళ ఆయన ముందర కాళ్ళకు బంధం వేయడానికే చంద్రబాబు ప్రమాణానికి ముందే ఈ ఫిర్యాదు చేశారు అని అంటున్నారు. అవినీతి నేతలను ఏ పార్టీ కూడా తీసుకోవద్దు అని చెప్పడం కూడా దీని వెనక ఉందని అంటున్నారు. మొత్తానికి బొత్సని తొలిగా టార్గెట్ చేశారు అని ముందు ముందు మరింత మంది మంత్రులకు ముసళ్ళ పండుగ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.