Begin typing your search above and press return to search.

బిగ్ బూమ్.. కోటి కోట్ల దిశగా భారత బిలియనీర్ల సంపద!

దీంతోపాటు భారత్‌లో బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది 185కు పెరిగిందని పేర్కొంది.

By:  Tupaki Desk   |   6 Dec 2024 7:30 PM GMT
బిగ్ బూమ్.. కోటి కోట్ల దిశగా భారత బిలియనీర్ల సంపద!
X

‘ఒక కోటి సంపాదించే వరకే నాకు గుర్తుంది.. ఆపై ఎంత సంపాదించానో గుర్తు లేదు’.. బిలియనీర్లు చెప్పే మాట ఇది. మిగతావారికి కాస్త ఆశ్చర్యంగానో, అతిగానో అనిపించినా కొంత నిజం ఉంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి, రెండు-మూడు యుద్ధాలు, రాజకీయంగా అనిశ్చిత పరిస్థితులు.. ఇలా ఏం జరుగుతున్నా ప్రపంచంలోని బిలియనీర్ల సంపద మాత్రం పెరిగిపోతూనే ఉండడం.

మనోళ్లు 185..

2014 నుంచి చూస్తే బిలియనీర్ల సంపద 121 శాతం పెరిగిందట. మొత్తంగా 14 ట్రిలియన్‌ డాలర్లకు చేరిందని స్విట్జర్లాండ్‌ అతి పెద్ద బ్యాంక్‌ యూబీసీ నివేదించింది. దీంతోపాటు భారత్‌లో బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది 185కు పెరిగిందని పేర్కొంది. వీరందరి సంపద కలిపితే రూ.76 లక్షల కోట్ల పైమాటేనని చెప్పింది.

అప్పట్లో 1,757.. ఇప్పుడు 2,682

2015 నుంచి చూస్తే ప్రపంచంలోని మొత్తం అపర కుబేరులు 1,757 మంది అని యూబీసీ పేర్కొంది. ఇప్పుడు వారు 2,682కు పెరిగారని తెలిపింది. అయితే, మూడేళ్ల కిందటితో పోలిస్తే ఈ సంఖ్య తగ్గింది. 2021లో ప్రపంచంలోని అపర కుబేరులు 2,686. ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఇక గత పదేళ్లలో వీరి మొత్తం సంపద 6.3 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 14 ట్రిలియన్‌ డాలర్లకు పెరిగింది.

టెక్ దే టిప్ టాప్

ఇప్పుడంతా టెక్నాలజీ యుగం.. అందుకే టెక్ బిలియనీర్ల సంపదకు రెక్కలొచ్చాయట. అప్పట్లో.. అంటే టెక్నాలజీ ఇంతగా లేని 2015లో టెక్ బిలియనీర్ల సంపద 788.9 బిలియన్‌ డాలర్లు. ఈ ఏడాది 2.4 ట్రిలియన్‌ డాలర్లు కావడం విశేషం.

పారిశ్రామికవేత్తలు సెకండ్

బిలియనీర్ల జాబితాలో సంప్రదాయ పారిశ్రామికవేత్తలు ద్వితీయ స్థానంలో ఉన్నారు. 2015-2020 మధ్య చైనా బిలియనీర్ల సంపద 887.3 బిలియన్‌ డాలర్ల నుంచి 2.1 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. తర్వాత నుంచి తరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 1.8 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

268 కొత్త బిలియనీర్లు.. భారతీయులు 185

2024లో ఒక్క ఏడాదిలోనే కొత్తగా 268 మంది బిలియనీర్లు పుట్టుకొచ్చారు. వీరిలో 60 శాతం వ్యాపార వ్యవస్థాపకులే. అమెరికా కుబేరుల సంపద 27.6శాతం పెరిగి 5.8 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. భారత్ లో బిలియనీర్ల సంఖ్య 153 నుంచి 185కు పెరిగింది. ఇక మన దేశ కుబేరుల మొత్తం సంపద ఈ ఏడాది 42.1శాతం పెరిగి 905.6 బిలియన్‌ డాలర్లకు (రూ.76లక్షల కోట్లకు పైమాటే) చేరింది. చూస్తూ ఉంటే ఏడాది రెండేళ్లలో ఇది కోటి కోట్లకు చేరడం ఖాయమే.