Begin typing your search above and press return to search.

బాబు లెక్క ప్రకారం ఏపీలో ఎన్నికలు అపుడేనా...!?

ఆయన జగన్ అధికారంలోకి వచ్చిన తొలి రోజులలో ఏడాదిలోనే ఎన్నికలు అంటూ వచ్చినా అవేమీ నిజం కాలేదు.

By:  Tupaki Desk   |   14 Feb 2024 4:35 PM GMT
బాబు లెక్క ప్రకారం ఏపీలో ఎన్నికలు అపుడేనా...!?
X

టీడీపీ అధినేత చంద్రబాబుది నాలుగున్నర దశాబ్దాల అనుభవం. ఆయన ఇప్పటికి తొమ్మిది ఎన్నికలను చూసారు. టీడీపీని గత ముప్పయ్యేళ్ళుగా సారధ్యం వహిస్తూ మోస్తున్నారు. అలా ఆయన ఎన్నికల రాజకీయాల్లో బాగా పండిపోయారు అనే చెప్పాలి. ఆయన జగన్ అధికారంలోకి వచ్చిన తొలి రోజులలో ఏడాదిలోనే ఎన్నికలు అంటూ వచ్చినా అవేమీ నిజం కాలేదు.

మధ్యంతర ఎన్నికలు అని అసెంబ్లీ రద్దు అని రకరకాల ప్రచారం టీడీపీ అనుకూల మీడియా 2020, 2021 ప్రాంతాలలో చేస్తూ వచ్చింది. కానీ అవి నెరవేరలేదు. ఫుల్ టెర్మ్ వైసీపీ అధికారంలో ఉంది. అయితే బాబు ఆనాడు అలా చెప్పినా అదంతా కూడా ఒక వ్యూహం ప్రకారమే అని అంటారు. భారీ మెజారిటీతో వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూలడం కష్టం అని బాబుకు కూడా తెలుసు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ సీనియర్ నేతలతో మాట్లాడుతూ ఎన్నికలకు గట్టిగా 56 రోజులే సమయం ఉందని ఒక లెక్క చెప్పారు. దానికి కనుక తరచి చూస్తే ఏప్రిల్ 11 అన్న డేట్ వస్తుంది. 2019లో ఏప్రిల్ 11న ఏపీలో ఎన్నికలు జరిగాయి. ఇపుడు సరిగ్గా అదే డేట్ కి ఎన్నికలు వస్తాయని బాబు అంచనా కడుతున్నారు.

ఆయన అంచనా నిజం కూడా అయి ఉండే అవకాశాలు సైతం ఉన్నాయి. ఈ నెలాఖరులో రాజ్యసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా 56 స్థానాలకు జరుగుతున్నాయి. దాంతో రాజ్యసభ ఎన్నికల తరువాత కానీ కేంద్ర ఎన్నికల సంఘం వేరే ఆలోచనలు పెట్టుకునే చాన్స్ లేదు.

అన్నీ చూసుకుని కేంద్ర ఎన్నికల సంఘం నెల రోజుల ముందు అంటే మార్చి 10న షెడ్యూల్ ప్రకటించవచ్చు. ఆ తరువాత వారంలో నోటిఫికేషన్ కూడా రావచ్చు. దానికి మూడు వారాల వ్యవధిలో మొదటి విడతలోనే ఏపీలో ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు.

దేశంలో ఈసారి దాదాపుగా ఎనిమిది విడతలుగా లోక్ సభ ఎన్నికలు ఉంటాయని అంటున్నారు. అయితే ఏపీతో పాటు కొన్ని రాష్ట్రాలలో మాత్రం అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. కానీ ఏపీ తెలంగాణాలకు మాత్రం తొలి విడతలోనే కంప్లీట్ అవుతాయి. ఇది అందరూ అనుకుంటున్నదే. అందుకే చంద్రబాబు కూడా ఇదే మాట అంటున్నారు.

మరో వైపు చూస్తే బీజేపీ పెద్దలతో టచ్ లో ఉంటూ వస్తున్న చంద్రబాబుకు ఏపీలో ఎపుడు ఎన్నికలు అన్నది తెలియడం డేట్ షెడ్యూల్ అన్నీ కూడా కచ్చితమైన సమాచారం ఉండడంలో ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇక ఏపీ సీఎం జగన్ కి కూడా ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగుతాయని తెలుసు. అందుకే ఆయన చకచకా తాను అనుకున్నది చేస్తున్నారు. మరో వైపు చూస్తే గట్టిగా రెండు నెలల వ్యవధి కూడా ఎన్నికలకు లేదు రాజకీయం మాత్రం వేడి పుంజుకుంది కానీ అనుకున్న స్థాయిలో అయితే లేదు అని అంటున్నారు. చూడాలి మరి మార్చి నుంచి ఎన్నికల వేడి వేసవి వేడిని తలపిస్తుందేమో.