Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలోని స్కూల్లో లైంగిక దాడి... పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతం!

అవును... బద్లాపూర్ లోని స్కూల్లో ఇటీవల ఇద్దరు చిన్నారులపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Sep 2024 3:48 AM GMT
మహారాష్ట్రలోని  స్కూల్లో లైంగిక దాడి... పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతం!
X

మహారాష్ట్రలోని ఠాణె జిల్లా బద్లాపూర్ లో ఇటీవల ఓ స్కూల్ లో ఇద్దరు చిన్నారులపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అత్యాచార ఘటనకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఈ సమయంలో పోలీసుల కాల్పుల్లో నిందితుడు మృతి చెందాడు.

అవును... బద్లాపూర్ లోని స్కూల్లో ఇటీవల ఇద్దరు చిన్నారులపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. అయితే... ఈ కేసు విచారణలో భాగంగా తలోజా జైలు నుంచి నిందితుడిని బద్లాపూర్ కు తీసుకొస్తున్నారు పోలీసులు.

ఈ సమయంలో నిందితుడు పోలీసులపై తిరగబడ్డారు. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారి తుపాకీని లాక్కుని కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. దీంతో... పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఆస్పత్రికి తరలించగా.. అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు.

వాస్తవానికి బద్లాపుర్ స్కూల్లో చోటు చేసుకున్న లైంగిక దాడి ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో... నిందితుడు అక్షయ్ శిండే (23)పై అతడి మొదటి భార్య కేసు పెట్టింది. దీంతో... ఈ కేసులో ప్రశ్నించేందుకు సిద్ధమైన పోలీసులు తలోజా జైలుకు వెళ్లి.. అక్కడ నుంచి నిందితుడిని తీసుకుని బద్లాపుర్ బయలుదేరారు.

ఈ నేపథ్యంలోనే వీరు ప్రయాణిస్తున్న కారు సాయంత్రం 6:30 గంటలకు ముంబ్రా బైపాస్ కు చేరుకున్న సమయంలో తన పక్కన ఉన్న పోలీసు అధికారి తుపాకీ లాక్కొన్ని కాల్పులకు తెగబడ్డాడు. దీంతో... అప్రమత్తమైన మరో పోలీసు.. నిందితుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అక్షయ్ తో పాటు పోలీసులు గాయపడ్డారు.

ఫైరవుతున్న ప్రతిపక్షాలు!:

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఈ కాల్పుల ఘటన వివాదాస్పదంగా మారుతోంది. చేతికి సంకెళ్లు ఉన్న వ్యక్తి తుపాకీ ఎలా లాక్కుంటారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీన్ని "ఎన్ కౌంటర్"గా అభివర్ణిస్తూ విమర్శలు చేస్తున్నాయి. ఇది సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నమేనా అని ప్రతిపక్ష నెత విజయ్ వాడెట్టివార్ ప్రశ్నించారు.

ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని ఒకచోట నుంచి మరో చోటికి తరలిస్తున్నప్పుడు హోంశాఖ చూపిన అలసత్వం ప్రశ్నార్థకం అని చెప్పిన శరద్ పవార్... ఈ ఘటన చూస్తుంటే ప్రభుత్వం బలహీనపడినట్లు కనిపిస్తోందని ఎక్స్ వేదికగా స్పందించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది?:

ఈ కేసులో అక్షయ్ షిండేను ఉరి తీయాలని ప్రతిపక్షాలు గతంలో డిమాండ్ చేశాయి.. అయితే ఇప్పుడు మాత్రం వారంతా నిందితుడి పక్షం వహించి, మహారాష్ట్ర పోలీసుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నారు అని ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అన్నారు. పోలీసులు తమ ఆత్మరక్షణ కోసం మాత్రమే కాల్చారు అని తెలిపారు.