ఈటల చెబితే వినట్లేదా?
కానీ చంద్రశేఖర్ రెడ్డి తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపారు.
By: Tupaki Desk | 15 Aug 2023 1:30 AM GMTబీజేపీలో ఈటల రాజేందర్ ప్రభావం ఏమీ లేదా? ఆయన మాటలను ఎవరూ వినడం లేదా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా అధిష్ఠానం ఈటల రాజేందర్‌కు కీలక పదవి ఇచ్చినా.. పార్టీ నాయకుల్లో మాత్రం ఆయన మాటకు విలువ లేదని తెలిసింది. తాజాగా మాజీ మంత్రి చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేయడమే అందుకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అవకాశం కోసం చూస్తున్న నాయకులు పార్టీలు మారుతున్నారు. దీంతో బీజేపీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లిపోయేలా కనిపించిన నాయకులకు బుజ్జగించే బాధ్యతను ఈటల తీసుకున్నారు. కానీ ఆయన మాటలను ఎవరూ వినడం లేదని తెలిసింది.
బీజేపీ సీనియర్ నేత అయిన చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి మరీ పార్టీ మారొద్దని ఈటల చెప్పారని సమాచారం. కానీ చంద్రశేఖర్ రెడ్డి తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపారు. బీజేపీలో చేరిన ఉద్యమకారులకు గౌరవం లేదని ఆరోపించి మరీ బయటకు వెళ్లిపోయిన ఆయన.. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.
1985 నుంచి 20008 వరకు వికారాబాద్ ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ అయిదు సార్లు గెలిచారు. 2019 ఎన్నికల్లోకాంగ్రెస్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారు. మరోవైపు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు విషయంలోనూ ఈటల దౌత్యం పనిచేయలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్‌పై కోపంతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈ ఇద్దరు నేతలను ఈటల కలిసి బీజేపీలోకి రప్పించే ప్రయత్నం చేశారు. కానీ పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరడంతో ఈటలకు దెబ్బ పడిందనే అంటున్నారు. ఇప్పుడు బీజేపీలో ఈటలకు ఏం కలిసి రావడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.