వేర్ ఈస్ అచ్చెన్న... హౌస్ అరెస్ట్ తర్వాత జరిగేదేమిటి?
అయితే చంద్రబాబు అరెస్ట్ అనంతరం అచ్చెన్నాయుడు ట్విట్టర్ లో మాత్రం స్పందించారు.
By: Tupaki Desk | 9 Sep 2023 6:26 AM GMTస్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో రూ.371 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఏ1 నిందితుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిన చంద్రబాబునాయుడిని శనివారం ఉదయం ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో అరెస్ట్ చేసిన ఆయనను వైద్యపరీక్షల అనంతరం విజయవాడకు తరలించారు. దీంతో హ్యూ ఇజ్ నెక్స్ట్ అనే చర్చ మొదలైంది.
అవును... ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో ఏ 1 గా ఉన్న చంద్రబాబుని అరెస్ట్ చేసిన అనంతరం.. ఏ2 గురించిన చర్చ మొదలైంది. చంద్రబాబు తర్వాత ఈ కేసులో మరో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీమంత్రి, ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడి అరెస్ట్ కూడా ఉంటుందా అనే ప్రశ్నలు ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేస్తున్నాయి.
అయితే ప్రస్తుతం అచ్చెన్నాయుడు శ్రీకాకులంలోనే ఉన్నారని సమాచారం. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్ అయిన నేపథ్యంలో అచ్చెన్నను కూడా చినవాల్తేరులో పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయనని ఎవరూ కలవకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే చంద్రబాబు విచారణ అనంతరం ఏ2 పై దృష్టి సారించే అవకాశం ఉందని అంటున్నారు!
అయితే చంద్రబాబు అరెస్ట్ అనంతరం అచ్చెన్నాయుడు ట్విట్టర్ లో మాత్రం స్పందించారు. "జగన్ రెడ్డి తన తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలుని తీవ్రం చేశాడు. టిడిపి అధినేత చంద్రబాబుని చట్టాల్ని ఉల్లంఘించి మరీ అక్రమ అరెస్టు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసి ప్రతిపక్ష నేతని తప్పుడు మార్గంలో అరెస్టు చేయించిన వైకాపా పతనం ఖాయం" అని ట్వీట్ చేశారు.
కాగా... గతంలో ఈఎస్ఐ లో అవినీతి కేసులో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో కూడా అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం కుంభకోణానికి కేంద్రమైన స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ.. కార్మికశాఖ పరిధిలోకి వస్తుంది. దీంతో చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడి పాత్ర కూడా ఉన్నట్టు సీఐడీ నిర్ధారించి ఏ2 నిందితుడిగా చేర్చింది!