అన్నమయ్య జిల్లాలో దారుణం.. రెచ్చిపోయిన ప్రేమోన్మాది
ప్రేమికుల దినోత్సవం రోజున దారుణం జరిగింది. తన ప్రేమను అంగీకరించలేదని పగబట్టిన దుర్మార్గుడు.. యువతిపై కత్తితో దాడి చేసి యాసిడ్ పోశాడు.
By: Tupaki Desk | 14 Feb 2025 9:42 AM GMTప్రేమికుల దినోత్సవం రోజున దారుణం జరిగింది. తన ప్రేమను అంగీకరించలేదని పగబట్టిన దుర్మార్గుడు.. యువతిపై కత్తితో దాడి చేసి యాసిడ్ పోశాడు. ఏపీలో అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంటున్న ఈ సంఘటన సంచలనంగా మారింది. బాధితురాలికి ఈ మధ్యనే పెళ్లి కుదిరింది. మరో నెల రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆమె చావుతో ఆస్పత్రిలో పోరాడటం కలిచివేస్తోంది.
అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలం ప్యారంపల్లికి చెందిన యువతి మదనపల్లెలో డిగ్రీ చదువుకుంది. చదువు పూర్తయ్యాక ఖాళీగా ఉండక, మదనపల్లెలోనే బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతోంది. ఈ నెల 7న ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్ లో పెళ్లి చేసేందుకు ముహూర్తాలు కూడా తీశారు. త్వరలో కొత్త జీవితం ప్రారంభించాల్సిన ఆమెపై ఓ ఉన్మాది పగపట్టాడు. మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన గణేశ్ అనే యువకుడు ప్రేమించమని ఆ యువతి వెంటపడుతూ వేధిస్తున్నాడు. దీనిపై పలుమార్లు ఆమె హెచ్చరించినా, ఉన్మాది గణేశ్ ప్రవర్తనలో మార్పు రాలేదు.
ఈ క్రమంలో ఆమెకు వివాహం కుదరడాన్ని సహించలేకపోయాడు. తన ప్రేమను అంగీకరించని ఆమెపై ప్రతీకరాం తీర్చుకోవాలని భావించి శుక్రవారం ఉదయం బాధితురాలి తల్లిదండ్రులు ఇంటి వద్ద లేని సమయంలో వచ్చాడు. బాధితురాలి తలపై కత్తితో దాడిచేశాడు. ఆ తర్వాత తన వెంట తెచ్చిన యాసిడ్ ను ఆమె ముఖంపై వేశాడు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. యువతి ఆరోగ్యం పట్ల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.