హైకోర్టు జడ్జి కొడుకును కొట్టిన సినీ నటుడు దర్శన్
పార్కింగ్ ఇష్యూ చిలికి చిలికి గాలివానలా మారటమే కాదు.. తమిళ హీరో కం బిగ్ బాస్ ఫేం దర్శన్ కు కొత్త తిప్పలు తెచ్చిపెట్టినట్లుగా చెబుతున్నారు.
By: Tupaki Desk | 5 April 2025 10:30 AMపార్కింగ్ ఇష్యూ చిలికి చిలికి గాలివానలా మారటమే కాదు.. తమిళ హీరో కం బిగ్ బాస్ ఫేం దర్శన్ కు కొత్త తిప్పలు తెచ్చిపెట్టినట్లుగా చెబుతున్నారు. అతగాడు ఏకంగా హైకోర్టు న్యాయమూర్తి కొడుకు.. అతడి అత్త మీద దాడి చేయటం సంచలనంగా మారింది. శ్రీలంకకు చెందిన నటుడు దర్శన్ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా పరిచయమైన అతను.. గూగుల్ కట్టప్ప మూవీతో హీరోగా మారాడు.
చెన్నైలోని ముగప్పేర్ లో ఉంటున్న ఆయన ఇంటి ముందు ఒక టీ షాపు ఉంది. టీ షాప్ కు వచ్చిన కొందరు దర్శన్ ఇంటి ముందు కారును పార్కు చేశారు. దీంతో కారు తీయాలని వారికి దర్శన్ చెప్పారు. ఈ క్రమంలో కారు నిలిపిన వ్యక్తికి.. దర్శన్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కారు పార్కు చేసిన వ్యక్తి మరెవరో కాదు.. హైకోర్టు న్యాయమూర్తి కొడుకు ఆత్తిచూడి. అతడితో పాటు.. అతడి అత్తపైనా దర్శన్ దాడి చేయటం.. ఇద్దరికి గాయాలు కావటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఉదంతంపై జేజే నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి ఉదంతంలో దర్శన్ తో పాటు.. ఆయన సోదరుడు లోకేశ్ లను కూడా అరెస్టు చేశారు. అదే సమయంలో హీరో దర్శన్ ఫిర్యాదు మేరకు హైకోర్టు జడ్జి కొడుకు.. ఆయన భార్య.. అత్తపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతం సంచలనంగా మారింది.