జగన్ ది ఓటమే కాదు.. హీరో సుమన్ సంచలన కామెంట్స్
ఈసారి ఎన్నికల ఫలితాలు పూర్తిగా తారుమారు అయ్యాయి. ఈ నేపథ్యంలో సినీ నటుడు సుమన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
By: Tupaki Desk | 12 March 2025 2:18 PM ISTఒకప్పుడు తన అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ప్రముఖ నటుడు సుమన్ ప్రస్తుతం సినీ పరిశ్రమకు కొంత దూరంగా ఉంటున్నారు. అయితే, అప్పుడప్పుడు రాజకీయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సమాజ సేవలో నిమగ్నమయ్యానని చెప్పుకుంటున్న ఆయన, సమకాలీన రాజకీయ అంశాలపై మాత్రం యథేచ్చగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తాజాగా సుమన్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీలు భారీ విజయం సాధించగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌కు ఊహించని ఓటమి ఎదురైంది.గత ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలతో పాటు 22 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈసారి ఎన్నికల ఫలితాలు పూర్తిగా తారుమారు అయ్యాయి. ఈ నేపథ్యంలో సినీ నటుడు సుమన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గత ఎన్నికలతో పోల్చితే, ఈసారి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి కూటమిగా పోటీకి దిగాయని ఆయన తెలిపారు. మరోవైపు జగన్ మాత్రం ఒక్కడిగానే బరిలోకి దిగారని అన్నారు.
అలాగే, ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ చాలా తక్కువ ఓటు తేడాతో ఓటమి పాలైందని సుమన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ప్రత్యేకంగా విద్యా రంగంలో డిజిటల్ బోర్డులు, "నాడు-నేడు" ప్రాజెక్ట్, టాయ్‌లెట్ల ఆధునీకరణ వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టారని చెప్పారు. పింఛన్ డోర్ డెలివరీ విధానం వంటి పథకాలు అమలు చేసి ప్రజల సంక్షేమానికి కృషి చేశారని గుర్తుచేశారు.
కరోనా మహమ్మారి సమయంలో కూడా జగన్ మంచి పరిపాలన అందించారని సుమన్ ప్రశంసించారు. మోదీ, చంద్రబాబు, పవన్ కలిసికట్టుగా జగన్‌ను ఎదుర్కొనడానికే వచ్చారని, అయినప్పటికీ జగన్ కేవలం తక్కువ ఓటు తేడాతోనే ఓటమిని చవిచూశారని అన్నారు. ప్రస్తుతం సుమన్ వ్యాఖ్యల వీడియోలు వైసీపీ సోషల్ మీడియా వర్గాల్లో వైరల్ అవుతున్నాయి.