Begin typing your search above and press return to search.

అనుకున్నట్లు జరిగితే అసెంబ్లీలో 'దర్శన్' ఇచ్చేవాడే. కానీ, ఇప్పుడు జైల్లో

గత ఏడాది ‘కాటేరా’ వంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన అతడు.. ఇప్పుడు జైలుకు వెళ్లే పరిస్థితుల్లో చిక్కుకున్నాడు

By:  Tupaki Desk   |   15 Jun 2024 11:30 PM GMT
అనుకున్నట్లు జరిగితే అసెంబ్లీలో దర్శన్ ఇచ్చేవాడే. కానీ, ఇప్పుడు జైల్లో
X

చాలెంజింగ్ స్టార్ గా పేరు తెచ్చుకుని.. అంతే స్థాయిలో వివాదాల్లో కూరుకున్న కన్నడ హీరో దర్శన్ తొగుదీప గురించి ప్రస్తుతం మీడియాలో ఒకటే చర్చ. అభిమానులే దేవుళ్లనే హీరోలున్న ఈ కాలంలో అభిమాన సంఘం అధ్యక్షుడినే హత్య చేయించారనే అభియోగాలు ఎదుర్కొంటున్నాడు దర్శన్. గత ఏడాది ‘కాటేరా’ వంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన అతడు.. ఇప్పుడు జైలుకు వెళ్లే పరిస్థితుల్లో చిక్కుకున్నాడు.

రాజకీయాల్లోనూ కాలు..

దర్శన్ ది సినిమా కుటుంబమే. తండ్రి నటుడు కాగా, సోదరుడు దర్శకుడు. కాగా, దర్శన్ కు క్రేజ్ రీత్యా అతడిని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వాడుకుంది. ఈ ప్రయత్నం వెనుక ఉన్నది కూడా కాంగ్రెస్ అగ్ర నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కావడం గమనార్హం. అయితే, ఇదే డీకే చన్నపట్న అసెంబ్లీ ఉప ఎన్నికలో దర్శన్‌ ను పోటీ చేయించేందుకు ప్రణాళిక వేశారంటూ బీజేపీ ఆరోపిస్తోంది. ఈ అనూహ్య అభ్యర్థి ఇప్పుడు కటకటాలపాలయ్యాడని ఎద్దేవా చేస్తోంది.

ఎవరూ ఊహించని వ్యక్తి అంటూ..

చన్నపట్న అనేది కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అధినేత కుమారస్వామి నియోజకవర్గం. కుమార ఇటీవల ఎంపీగా గెలిచారు. దీంతో చన్నపట్నకు రాజీనామా చేయాల్సి ఉంది. అక్కడ ఎవరూ ఊహించని వ్యక్తిని ఉప ఎన్నికలో నిలబెడతామని డీకే శివకుమార్ సోదరుడ డీకే సురేశ్‌ ఇటీవల ప్రకటించారు. ఆ అనూహ్య అభ్యర్థి దర్శన్ అని తెలుస్తోంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపడంతో చన్నపట్న నుంచి అధికార కాంగ్రెస్ తరఫున దింపాలని భావించారు. అయితే, వారు అనుకున్నది ఒకటి.. జరిగింది ఒకటి.. మంచి ఫాలోయింగ్ ఉన్న దర్శన్ ఏ హీరో, నటుడూ చేయని పొరపాటు చేశాడు. ఫలితం అనుభవిస్తున్నాడు.