అన్నీ 420 పనులు చేసి 400 సీట్లు కావాలా.. ప్రముఖ సినీ నటుడు ఫైర్
బీజేపీపై, ఆ పార్టీ నేతలపై ఒంటి కాలిపై లేచేవారిలో ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఒకరు
By: Tupaki Desk | 18 March 2024 6:34 AM GMTబీజేపీపై, ఆ పార్టీ నేతలపై ఒంటి కాలిపై లేచేవారిలో ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఒకరు. నిత్యం సోషల్ మీడియాలో బీజేపీ నేతలపై, కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నీ 420 పనులు చేసి లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని అంటున్నారని బీజేపీ నేతలపై పరోక్షంగా ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. 400 సీట్లకు పైగా గెలుస్తామనడం మూర్ఖత్వమేనన్నారు.
ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 370 సీట్లు, ఎన్డీఏ 400కుపైన సీట్లు గెలుస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచార సభల్లోనూ ఆయన ‘‘అబ్ కీ బార్ చార్ సౌ పార్ (ఈసారి 400కుపైన) అనే నినాదాన్ని ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో కర్ణాటకలోని చిక్ మగళూరులో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీనే కాకుండా కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీలు 400 సీట్లు సాధిస్తామని ప్రకటనలు చేసినా అది మూర్ఖత్వమేనన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క పార్టీ ఒంటరిగా 400కుపైగా సీట్లు గెలిచే అవకాశమే లేదని తేల్చిచెప్పారు.
ప్రజలు గెలిపిస్తేనే ఎవరైనా గెలుస్తారని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. ఇన్ని సీట్లు గెలుస్తామని ఏ పార్టీ చెప్పడానికి వీల్లేదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని 420లు చెబుతున్నారని మండిపడ్డారు. అలా చెప్పే రాజకీయ పార్టీ కాంగ్రెస్ కావొచ్చు, ఇతర పార్టీ అయి ఉండొచ్చు, అలా చెప్పడం అహంకారమే అవుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ 400 అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశమే లేదన్నారు.
ప్రజలు ఓటు వేస్తేనే సదరు పార్టీ అభ్యర్థి గెలుస్తారని ప్రకాశ్ రాజ్ తెలిపారు. అలాంటిది ఓ రాజకీయ పార్టీ, ఆ పార్టీ నేత తమ పార్టీ ఇన్ని సీట్లు గెలుస్తామని ఎలా చెబుతారని నిలదీశారు. దీనిని ముమ్మాటికీ అహంకారం అంటారని మండిపడ్డారు. ఈ మేరకు బీజేపీ, ప్రధాని మోదీ పేరు ఎత్తకుండా పరోక్షంగా ప్రకాశ్ రాజ్ విమర్శలు చేశారు.
బీజేపీ నేతలను 420లు అని వ్యాఖ్యానించడం ద్వారా ప్రకాశ్ రాజ్ తేనెతుట్టెను కదిపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీపై ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్న ఆయనపై తాజా వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నేతలు ఘాటుగా విరుచుకుపడొచ్చని అంటున్నారు.