Begin typing your search above and press return to search.

నో పాలిటిక్స్ అంటున్న సినీ తారలు ..!?

ఏపీ ఎన్నికలు మరో నలభై రోజులలో జరగనున్నాయి. ప్రచారం వేడెక్కుతోంది.

By:  Tupaki Desk   |   3 April 2024 4:05 AM GMT
నో పాలిటిక్స్  అంటున్న  సినీ తారలు ..!?
X

ఏపీ ఎన్నికలు మరో నలభై రోజులలో జరగనున్నాయి. ప్రచారం వేడెక్కుతోంది. అటు అధికార వైసీపీ ఇటు విపక్ష టీడీపీ కూటమి ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉన్నాయి. అన్ని రకాలైన అస్త్రశస్త్రాలు బయటకు తీస్తున్నాయి. ఇదిలా ఉంటే అధికార వైసీపీకి స్టార్ క్యాంపెయినర్ అయినా మరోటి అయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే. ఆయనే నడుం బిగించి రంగంలోకి దూకుతున్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం జిల్లా దాకా జగన్ బస్సు యాత్ర చేస్తున్నారు. దాని తరువాత మరో యాత్ర అయినా ఎన్నికల ప్రచారాలు అయినా జగన్ చేయాల్సిందే.

ఇది 2019 ఎన్నికల నాటికి పూర్తిగా భిన్నం. ఎందుకంటే ఆ ఎన్నికల్లో చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ జగన్ తో పాటు వైసీపీకి ప్రచారం చేసి కొంత భారం తగ్గించారు. ఈసారి మాత్రం జగన్ ప్రచారం చేయాలి. ఇక గత ఎన్నికల్లో సినీ నటులు కొందరు వైసీపీ తరఫున ప్రచారం చేశారు. మోహన్ బాబు జీవితా రాజశేఖర్, జయసుధ వంటి వారు జనంలోకి వచ్చారు.

ఈసారి చూస్తే సినీ మద్దతు పూర్తిగా వైసీపీకి తగ్గిపోయింది. సినీ రంగం నుంచి ఉన్న ఏకైక స్టార్ కమెడియన్ అలీ కూడా తనకు టికెట్ దక్కక పోవడంతో అసంతృప్తితో ఉన్నారు. నాడు వైసీపీకి ప్రచారం చేసిన మరో కమెడియన్ పృధ్వీరాజ్ ఇపుడు జనసేనకు షిఫ్ట్ అయ్యారు. ఇలా చూస్తే కనుక వైసీపీకి సినీ కళ మచ్చుకైనా కనిపించడం లేదు.

అదే టైం లో విపక్ష కూటమి వైపు కూడా చూసేందుకు సినీ తారలు పెద్దగా ఆసక్తి చూపించడంలేదు అని అంటున్నారు. దానికి కారణం ఈసారి ఎన్నికలు హోరా హోరీగా సాగుతున్నాయి. ఏపీలో ఎవరు గెలిచినా తమకు సినీ సమస్యలు పరిష్కరించే దిశగా ఉండాలి. అందుకు నో పాలిటిక్స్ అన్నట్లుగా సినీ ప్రముఖులు దూరంగా ఉంటున్నారు అని అంటున్నారు.

గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు టీడీపీకి సపోర్ట్ గా నిలిచారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది అనంతరం ఒక విధమైన గ్యాప్ పెరిగిపోయింది అని అంటారు. దాంతో ఈసారి ఆచీ తూచీ వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. దాంతో పాటుగా సినీ రంగం అంటే అందరూ కావాలి అన్ని వర్గాలు కావాలి అనవసరంగా రాజకీయ రొచ్చులోకి ఇరుక్కోవడం ఎందుకు అన్న ఆలోచనతో కూడా చాలా మంది ఉన్నారని అంటున్నారు.

ఇక జనసేన తరఫున ప్రచారం చేసేందుకు మెగా ఫ్యామిలీ వస్తుందని వార్తలు వచ్చినా అది కూడా జరిగే అవకాశాలు లేవు అని అంటున్నారు. పొత్తులలో 21 సీట్లకు మాత్రమే జనసేన పోటీ చేస్తోంది. దాంతో ఆ ప్రచారాన్ని పవన్ నిర్వహిస్తారు అని అంటున్నారు. పవన్ కూడా కోరి ఎవరిని పిలవడం లేదు అని అంటున్నారు. మెగా ఫ్యామిలీకి సినీ కెరీర్ ఇంపార్టెంట్ అన్న ఆలోచనతో ఆయన ఉన్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈసారి సినీ సందడి అయితే అంతగా కనిపించదు అంటున్నారు. మరి ఎన్నికల చివరి విడత ప్రచారంలో ఎవరైనా దిగుతారేమో తెలియదు కానీ ఇప్పటికైతే ఏమీ హడావుడి కనిపించడంలేదు అనే అంటున్నారు.