ఏపీలో వచ్చేది ఆ ప్రభుత్వమే: ప్రముఖ సినీ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలో తాజాగా తిరుపతిలో తన అభిమాని కుమార్తె పెళ్లికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 19 Feb 2024 6:19 AM GMTప్రముఖ సినీ నటుడు సుమన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఆయన పలు భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే గౌడ కుల సంఘాల సమావేశాలకు సైతం ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే తన స్నేహితులను కలుసుకోవడానికి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా తిరుపతిలో తన అభిమాని కుమార్తె పెళ్లికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సీట్ల సర్దుబాటు చక్కగా జరిగితే టీడీపీ–జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని హాట్ కామెంట్స్ చేశారు. పరిపాలన బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని సుమన్ కొనియాడారు. ఆయన తనకు రాజకీయాల్లో గురువుని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేయాలని సుమన్ పిలుపునిచ్చారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తనకు ఇప్పుడే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదని వెల్లడించారు. రాజకీయంగా ఆలోచనతో కూడిన అడుగులు వేస్తున్నట్టు తెలిపారు.
తమిళనాడులో ప్రముఖ సినీ నటుడు విజయ్ పార్టీ పెట్టడాన్ని సుమన్ స్వాగతించారు. అయోధ్యలో రాముడి ప్రతిష్ట జరగడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఆయనను దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతమన్నారు.
కాగా గతంలో సుమన్ వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. గతంలో కోనసీమ జిల్లాకు వచ్చినప్పుడు వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మరోసారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని సుమన్ అభిప్రాయపడ్డారు. ప్రజలు, తమ అభిమానులు తెలిపిన అభిప్రాయాల మేరకు మరోసారి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని తనకు సమాచారం ఉందన్నారు.
గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పట్టించుకోలేదని సుమన్ ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే సముచిత న్యాయం జరిగిందని వారే చెబుతున్నారని వెల్లడించారు. నవరత్న పథకాలను 95 శాతం అమలు చేసి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించి సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
మళ్లీ ఇంతలోనే తాజాగా తిరుపతి పర్యటనలో టీడీపీ –జనసేన కూటమి గెలుస్తుందని సుమన్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల రాజమండ్రి పార్లమెంటు సీటుకు వైసీపీ తరఫున సుమన్ పేరు కూడా వినిపించింది. అయితే ఈ సీటును ఆయనకు కేటాయించలేదు.
కాగా గౌడ సామాజికవర్గానికి చెందిన సుమన్ కు రాజకీయాలంటే ఆసక్తి మెండుగా ఉంది. 1996లోనే టీడీపీకి ఆయన సానుభూతిపరుడిగా ఉండేవారు. అప్పట్లో చంద్రబాబు పాల్గొన్న పలు సభలు, కార్యక్రమాల్లోనూ సుమన్ పాల్గొన్నారు. 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున సుమన్ పోటీ చేయడం ఖాయమనే వార్తలు వినిపించాయి. అయితే చివరి క్షణంలో ఎందుకో అవి కార్యరూపం దాల్చలేదు.
అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు భువనగిరిలో సుమన్ మాట్లాడుతూ కేసీఆర్ ఆహ్వానిస్తే బీఆర్‌ఎస్ లో చేరతానని వెల్లడించారు. తన మద్దతు బీఆర్‌ఎస్ కే ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు టీడీపీ–జనసేన కూటమికి అనుకూలంగా ఆయన మాట్లాడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.