విజయశాంతి కాంగ్రెస్ లోకి... కన్ ఫర్మ్ గా...!
ఇక కిషన్ రెడ్డి అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి ఆమె రాలేదు. అంతే కాదు పార్టీ మీద ఆమె అడపా తడపా సెటైర్లు వేస్తూ వస్తున్నారు
By: Tupaki Desk | 11 Nov 2023 4:35 PM GMTమాజీ ఎంపీ, నిన్నటి తరం సినిమా నటి విజయశాంతి హస్తం గూటికి చేరనున్నారు. ఇది అధికారికంగా కాంగ్రెస్ కీలక నేత పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. ఆమె తొందరలోనే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారని రవి మీడియాకు తెలిపారు.
విజయశాంతి బీయారెస్, కాంగ్రెస్ బీజేపీ ఇలా అన్ని పార్టీలలోనూ కొనసాగారు. ఆమె బీజేపీలోకి రెండవమారు వచ్చారు అయితే ఆమెకు పార్టీలో సరైన ప్రాధాన్యత లేదని చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీ తెలంగాణా ప్రెసిడెంట్ బండి సంజయ్ ని పక్కకు పెట్టినప్పటి నుంచి విజయశాంతి కూడా బీజేపీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు
ఇక కిషన్ రెడ్డి అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి ఆమె రాలేదు. అంతే కాదు పార్టీ మీద ఆమె అడపా తడపా సెటైర్లు వేస్తూ వస్తున్నారు. అనేక సార్లు అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణా పర్యటనకు వచ్చినా కూడా విజయశాంతి వారి సభలలో కనిపించలేదు.
దీంతో ఆమెకు పార్టీకి గ్యాప్ పెరిగింది అని అంతా అనుకుంటూ వచ్చారు. ఇక తెలంగాణా ప్రజల మనసులో కాంగ్రెస్ పక్షాన నిలబడి పోరాడాలని ఉందని ఆమె ఇటీవల ఒక ట్వీట్ చేశారు. ఇవన్నీ చూసిన వారికి ఆమె పార్టీ మారడం ఖాయమని కూడా అనిపించింది.
ఇదిలా ఉంటే విజయశాంతి కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయాలని అనుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే హై కమాండ్ ఆమె ఆలోచనను పట్టించుకోలేదని అంటున్నారు. ఇక బీజేపీ తరఫున స్టార్ కాంపెనియర్లను ఎంపిక చేసినపుడు విజయశాంతి పేరు ఫస్ట్ లిస్ట్ లో లేదు. ఆ తరువాత ఆమె పేరుని చేర్చారు.
ఇలా అటు అధినాయకత్వం ఆమె కదలికలను జాగ్రత్తగా గమనిస్తోంది. ఇటు విజయశాంతి సైతం పార్టీ పోకడల పట్ల గుర్రుగా ఉన్నారు. వీటికి తోడు బీజేపీ గ్రాఫ్ అంతకంతకు పడిపోవడం కూడా విజయశాంతి ఆలోచనలలో మార్పునకు కారణం అని అంటున్నారు.
ఆమె ఎంపీ పదవీకాలం పూర్తి అయి కూడా పదేళ్ళు అయ్యాయి. బీజేపీలో చూస్తే అవకాశాలు రాలేదు. రాజ్యసభ ఇస్తారని అనుకున్నా ఇవ్వాలేదు. తన లాంటి ఫైర్ బ్రాండ్ విమెన్ సేవలను పార్టీ ఉపయోగించుకోవడం లేదని ఆమె మధన పడుతున్నారని అంటున్నారు.
ఇక సరిగ్గా ఎన్నికల వేళ ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అన్న వార్తలు మాత్రం బీజేపీకి షాకింగ్ న్యూస్ కాకపోయినా ఇబ్బందిపెట్టేవే అని అంటున్నారు. అదే టైం లో ఆమె కాంగ్రెస్ లో చేరి 2024 ఎన్నికల్లో మెదక్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని కూడా అంటున్నారు. మొత్తానికి సరైన హామీ లభించబట్టే విజయశాంతి పార్టీ మారుతున్నారని అంటున్నారు.
మల్లు రవి నేడో రేపో అంటున్నా అమావాస్య పోయాక ఆమె మంచి రోజు చూసుకుని కాంగ్రెస్ జెండా పట్టుకుంటారని అంటున్నారు. విజయశాంతి కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకుని అంటు బీజేపీని ఇటు బీయారెస్ ని ఎండగడతారని అంటున్నారు. మొత్తానికి అనుకున్నదే నిజం అవుతోంది అని అంటున్నారు. రాములమ్మ బీజేపీకి రాం రాం అనేస్తున్నారు అన్నది పాత వార్త కొత్తగా ఇపుడు పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.