Begin typing your search above and press return to search.

ఏమైనా పూనమ్ ధైర్యం లెక్కనే వేరబ్బా?

సెలబ్రిటీలకు తమ సొంత ఇమేజ్ కు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మెరపులే తప్పించి మరకలు అంటించుకోవటానికి ఏ మాత్రం సిద్ధంగా ఉండరు

By:  Tupaki Desk   |   15 Sep 2023 4:26 AM GMT
ఏమైనా పూనమ్ ధైర్యం లెక్కనే వేరబ్బా?
X

సెలబ్రిటీలకు తమ సొంత ఇమేజ్ కు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మెరపులే తప్పించి మరకలు అంటించుకోవటానికి ఏ మాత్రం సిద్ధంగా ఉండరు. అలాంటి పరిస్థితే ఏర్పడుతుందంటే.. కిలోమీటర్ల ముందు నుంచే పలాయనం చిత్తగిస్తారు. అంతే తప్పించి.. న్యాయం.. అన్యాయం లాంటి విషయాల్ని ప్రస్తావించే ప్రయత్నం చేయరు. రాజకీయ ప్రముఖులకు సంబంధించి అధికారంలో ఉన్న వారితో ప్రయాణం చేయటానికి ఇష్టపడతారు. ఒకవేళ పెద్దగా ఇష్టం లేకుండా మౌనంగా ఉండిపోతారే తప్పించి.. ఇదెక్కడి పద్దతి? అన్న ప్రశ్న మాత్రం వేయరు.

రాజకీయ అంశాలేంటి? సామాజిక అంశాల మీద మాట్లాడేందుకు మొగ్గు చూపని తీరు మన సెలబ్రిటీల్లో ఎక్కువ. పక్కనే ఉన్న తమిళనాడులో ఏదైనా విపత్తు ఎదురైనప్పుడు.. పాలకుల తప్పుల్ని మాటలతో కాకుండా చేతలతో ఎత్తి చూపేందుకు వెనుకాడని తీరు కనిపిస్తుంది. కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అలాంటి ధోరణి కనిపించదు. అందుకే.. కీలకమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు.. ఆయా రాజకీయ పార్టీలకు మద్దతుగా పని చేసే వారు మాట్లాడతారే తప్పించి.. మిగిలిన వారంతా మౌనంగా ఉండిపోతారు.

విచిత్రమైన అంశం ఏమంటే.. చంద్రబాబు కారణంగా లబ్ధి పొందినోళ్లు.. రాజకీయ ప్రయోజనం పొందినోళ్లు.. ఆయన కారణంగా పదవులు అనుభవించిన వారు సైతం ఆయన్ను అరెస్టు చేసి.. జైల్లో పెట్టినప్పటికీ స్పందించిన వారు చాలా చాలా తక్కువమంది. ఇలాంటివేళ.. హీరోయిన్ గా వేళ్ల మీద లెక్క పెట్టే సినిమాల్ని చేసి.. నటిగా కూడా పెద్దగా ఆఫర్లు లేనప్పటికీ పూనమ్ కౌర్ ప్రదర్శించే తెగువ చూస్తే మాత్రం ముచ్చట వేయక మానదు.

ఆమె చేసే వ్యాఖ్యలు.. పెట్టే పోస్టులు సెన్స్ బుల్ గా ఉంటాయా? లేదా? అన్నది పక్కన పెడితే.. ఏదైనా జరిగినప్పుడు వాటి మీద స్పందించే గుణం తనకు ఉందన్న విషయాన్ని ఆమె ఎప్పటికప్పుడు చెప్పేసే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు అరెస్టు వేళ.. టాలీవుడ్ కు చెందిన చాలామంది నోరు మూసేసుకొని ఉన్న వేళ.. అందుకు భిన్నంగా ఆమె రియాక్టు అయ్యారు. ప్రజల కోసం ఎంతో సేవ చేసి.. వారి కోసం అన్నీ త్యాగం చేసిన ఒక గొప్ప వ్యక్తిని 73 ఏళ్ల వయసులో ఇలా బాధ పెట్టటం.. జైలుకు పంపటం తగదు. ఆయన హెల్త్ కండీషన్ ను చూసైనా మానవతా దృక్పథంతో ఆలోచించండి అంటూ ట్వీట్ చేశారు.

గతంలో పెద్ద వయస్కుల మీద ఒకలాంటి గౌరవ మర్యాదలు ఉండేవి. ఏపీలో ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. రాజకీయ భేదాభిప్రాయాల్ని వ్యక్తిగత వైరంగా మార్చేసుకున్న వేళ.. విషయం ఏదైనా రాజకీయ కోణంలోనే చూడటం ఒక అలవాటుగా మారింది. 73 ఏళ్ల వయసులో చంద్రబాబును కష్టపెడతారా? అన్న ప్రశ్నకు ఒకరు బదులిస్తూ.. ఎన్టీఆర్ కు 73 ఏళ్ల వయసులో చంద్రబాబు చేసిందేంటి? అంటూ తనకు తెలిసిన విషయాన్నే నిజంగా చెప్పేశారు.

ఎన్టీఆర్ మరణించింది 72 ఏళ్ల వయసులో. ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయటం.. వైస్రాయ్ ఘటన జరిగింది 70-71 ఏళ్ల వయసులో. కాకుంటే.. తమ వాదనకు తగ్గట్లుగా విషయాల్ని మార్చేసుకునే ధోరణి ఈ మధ్యన ఎక్కువ కావటం తెలిసిందే. అందులో భాగంగా తమకు తోచినట్లుగా అభిప్రాయాల్ని పోస్టు చేయటం ఎక్కువైంది. పూనమ్ పై చంద్రబాబు వ్యతిరేకులు విమర్శలతో విరుచుకుపడితే.. ఆయన్ను అభిమానించేవారు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఏమైనా.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేసే విషయంలో పూనమ్ ధైర్యం లెక్కలు వేరే లెవల్ అని మాత్రం చెప్పక తప్పదు.