ఏ పాపం తెలీదు: అదానీ మరోసారి
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒకసారి దీనిపై అదానీ గ్రూపు సంస్థలు స్పందించాయి.
By: Tupaki Desk | 27 Nov 2024 12:30 PM GMTతనపై వస్తున్న ఆరోపణలు, అమెరికాలో నమోదైన కేసుల వ్యవహారంతో ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీ ఉక్కిరిబిక్కిరికి గురవుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు పార్లమెంటు కూడా ఈ వ్యవహారంపై స్తంభిస్తోంది. ఇక, బయట కూడా రాజకీయంగా తీవ్ర విమర్శలు, వాదనలు, ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒకసారి దీనిపై అదానీ గ్రూపు సంస్థలు స్పందించాయి. తమ కు ఎలాంటి పాపం తెలియదని చెప్పాయి.
అయినప్పటికీ ఈ దుమారానికి ఎక్కడా బ్రేకులు పడడం లేదు. మరింత పెరుగుతున్న పరిస్థితి కనిపి స్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం మరోసారి అదానీ గ్రూప్‌నకు చెందిన గ్రీన్ ఎనర్జీ సంస్థ స్టాక్ ఎక్సేంజ్‌కు లేఖ రాసింది. తమ గ్రూపుపై దుష్ప్రచారం జరుగుతోందని, ఓ వర్గం మీడియా పనిగట్టుకుని ప్రచారం చేస్తోందని ఆరోపించింది. అమెరికాలోఅసలు కేసులు నమోదు కాలేదని తెలిపింది. పైగా లంచం, అవినీతి వంటి ఆరోపణలు అసలే లేవని పేర్కొంది.
``అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సమీప బంధువు సాగర్ అదానీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వీనిత్ జైన్‌లపై లంచం ఆరోపణలపై కేసు నమోదు చేశారనే వార్తల్లో వాస్తవం లేదు. వీరిపై ఫారెన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ కింద అవినీతి, లంచం తదితర కేసులు నమోదు అయినట్లు వస్తున్న వార్తలు కూడా పూర్తి నిరాధారం. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వీనిత్ జైన్‌లపై సెక్యూరిటీస్‌కు సంబంధించి మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారే తప్ప.. లంచం, అవినీతి కేసుల్లో కాదు. ఎఫ్‌సీపీఏ చట్టం ఉల్లంఘించారంటూ అమెరికా న్యాయ శాఖ నమోదు చేసిన కేసులో వీరి ప్రస్తావన లేదు`` అని గౌతమ్ అదానీ కంపెనీ వివరణ ఇచ్చింది.