అంబానీని దాటేసిన అదానీ.. షారుక్ సైతం!
అయితే అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో అదానీ గ్రూపు సంస్థల షేర్లు స్టాక్ మార్కెట్ లో భారీగా దెబ్బతిన్నాయి.
By: Tupaki Desk | 29 Aug 2024 9:03 AM GMTఅదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి భారత బిలియనీర్ల జాబితాలోకి దూసుకొచ్చారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని అధిగమించారు. గతంలో భారత బిలియనీర్ల జాబితాలో టాప్ లో గౌతమ్ అదానీ ఉన్న సంగతి తెలిసిందే. అయితే అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో అదానీ గ్రూపు సంస్థల షేర్లు స్టాక్ మార్కెట్ లో భారీగా దెబ్బతిన్నాయి. దీంతో ఆయన సంపద హరించుకుపోయింది. దీంతో టాప్ లో అదానీ స్థానం కోల్పోయారు.
మళ్లీ ఇటీవల కాలంలో అదానీ గ్రూపు సంస్థలు మెరుగైన పనితీరు కనబర్చడంతో ఆయన ఆస్తులు భారీగా పెరిగాయి. దీంతో భారత కుబేరుల జాబితాలో టాప్ కు చేరారు. అంతేకాకుండా దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని గౌతమ్ అదానీ అధిగమించారు.
అలాగే భారత్ లోనూ అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ నిలిచారు. ఈ మేరకు హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ ను విడుదల చేసింది. గత ఐదేళ్లుగా దేశంలో బిలియనీర్లు పెరుగుతున్నారని నివేదిక పేర్కొనడం విశేషం.
మన దేశంలో మొత్తం 334 మంది బిలియనీర్లు ఉన్నారని హూరూన్ వెల్లడించింది. బిలియనీర్ల జాబితాలో ఏడాదిలో 29 శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. అదే సమయంలో చైనాలో బిలియనీర్ల సంఖ్య 25 శాతం మేర తగ్గిపోవడం గమనార్హం. జులై 31 నాటి గణాంకాలను ఆధారంగా చేసుకొని హురూన్ ఈ నివేదికను విడుదల చేసింది.
హురూన్ ఇండియా తాజా జాబితా ప్రకారం.. గౌతమ్ అదానీ ఆస్తుల విలువ రూ.11.61 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడాదిలో ఆయన సంపద ఏకంగా 95 శాతం పెరగడం విశేషం. గతేడాది అదానీ ఆస్తుల విలువ రూ.5.63 లక్షల కోట్లుగా ఉంది.
ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రూ.10.14 లక్షల కోట్లతో దేశంలో రెండో అత్యధిక ధనవంతుడిగా నిలిచారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్‌నాడార్, ఆయన కుటుంబం రూ.3.14 లక్షల కోట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది.
అలాగే సీరమ్ ఇనిస్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా, సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. బిర్లా గ్రూపు సంస్థల అధినేత కుమార మంగళం బిర్లా, హిందూజా సంస్థల అధినేత గోపీచంద్ హిందుజా, డీమార్ట్ అధినేత రాధాకృష్ణ దమానీ, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ, బజాజ్ గ్రూపు సంస్థల అధినేత నీరజ్ బజాజ్ టాప్–10 ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
కాగా బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కూడా హూరూన్ బిలియనీర్ల జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. ఆయన సంపద రూ.7,300 కోట్లని హురూన్ పేర్కొంది. షారుక్ బిలియనీర్ గా నిలవడంలో కోల్ కతా నైట్ రైడర్స్ లోని వాటాలు, తన సొంత నిర్మాణ సంస్థ.. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధాన పాత్ర పోషించాయి
షారుక్ తోపాటు సినిమా రంగం నుంచి బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నవారిలో జుహీ చావ్లా, హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్ ఉన్నారు.
కాగా హురూన్ వెలువరించిన బిలియనీర్ జాబితాలో 21 ఏళ్ల కైవల్య వోహ్రా కూడా ఉన్నాడు. తద్వారా అతి పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. జెప్టో కంపెనీ వ్యవస్థాపకుడిగా కైవల్య వోహ్రా ఉన్నారు. ఆయనతోపాటు మరో సహ వ్యవస్థాపకుడు అదిత్ పలిచా (22) కూడా జాబితాలో చోటు దక్కించుకున్నారు.