అదానీ.. అమెరికా ఎపిసోడ్ లో జగన్ పేరు?
ఏపీ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి 4667 మెగావాట్లు.. అజూర్ పవర్ ఇండియా లిమిటెడ్ నుంచి 2333 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు తొలి ఒప్పందం కుదిరింది.
By: Tupaki Desk | 22 Nov 2024 4:43 AM GMTఅదానీ సంస్థపై అమెరికా కోర్టులో కేసు నమోదు కావటం.. దీనికి సంబంధించిన పరిణామాలు వేగంగా చోటు చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. అంతే వేగంగా రియాక్షన్లు వచ్చేస్తున్నాయి. ఇలాంటి వేళ.. అమెరికా దర్యాఫ్తు సంస్థల విచారణలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి - అదానీల మధ్య చోటు చేసుకున్న రహస్య ఒప్పందానికి సంబంధించిన వివరాలు కూడా బయటకు రావటం సంచలనంగా మారింది.
అదానీ - జగన్ మధ్య కుదిరిన ఒప్పందాల వివరాల్ని తేదీలతో సహా.. అసలేం జరిగిందన్న వివరాల్ని బయటకు వెల్లడించటం చూస్తూ.. అమెరికా విచారణ సంస్థల దర్యాప్తు వర్సెస్ దేశీయ విచారణ సంస్థల జోరు మధ్య వ్యత్యాసం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇంతకూ అమెరికా దర్యాప్తు సంస్థలు ఏ అంశాల్ని ప్రస్తావించాయి? ఆ సందర్భంగా ఏం జరిగిందన్న వివరణను చూస్తే..
2021-09-12 (సెప్టెంబరు 12, 2021)
2019లో అదానీ సంస్థతో సెకి ఒక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం రాజస్థాన్ లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సాయం చేస్తుంది. అదానీ సంస్థ కోట్ చేస్తున్న ధరకు విద్యుత్ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాలేదు. ఈ క్రమంలో గౌతమ్ అదానీ రంగంలోకి దిగారు.
2021-09-15 (సెప్టెంబరు 15, 2021)
తాడేపల్లిలోని జగన్ నివాసంలో గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు అద్యంతం రహస్యంగా ఉండటం గమనార్హం. వీరి మధ్య కుదిరిన రహస్య ఒప్పందానికి సంబంధించి.. బయటకు వచ్చిన డీల్ విషయానికి వస్తే సెకి నుంచి ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది. దీని సారాంశం ఏమంటే.. అదానీ విద్యుత్ సంస్థలు యూనిట్ రూ.2.49 చొప్పున ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేసేందుకు ముందుకు వచ్చాయి.
పాతికేళ్లు ఆ విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు తమతో ఒప్పందం చేసుకోవాలని ఏపీ విద్యుత్ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. సాధారణంగా ఇలాంటి ప్రతిపాదనలు వస్తే.. సదరు శాఖ కార్యదర్శి.. సంబంధిత మంత్రి పరిశీలన తర్వాతే ముఖ్యమంత్రి ముందుకు పెడతారు. ఆయన ఓకే చెబితే.. కేబినెట్ లో చర్చకు పెట్టి.. ఆమోద ముద్ర వేస్తారు.
2021-09-16 (సెప్టెంబరు 16, 2021)
సాధారణంగా ప్రభుత్వంతో పని అంటే దానికి పట్టే టైం గురించి తెలిసిందే. అందునా వేల కోట్ల రూపాయిలకు సంబంధించిన అంశం అన్నప్పుడు ఆలస్యం సహజం. అందుకు భిన్నంగా ఈ ఎపిసోడ్ చోటు చేసుకుంది. సెకి నుంచి ఏపీ విద్యుత్ శాఖకు వచ్చిన ప్రతిపాదనకు జెట్ స్పీడ్ స్పందన లభించింది. సెకి నుంచి లేఖ అందిన తర్వాతి రోజే.. మంత్రివర్గ సమావేశ ఎజెండాలో పెట్టేశారు. రాష్ట్రంలో 6600 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అప్పటికే పిలిచిన టెండర్లను రద్దు చేసి.. సెకి నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని కేబినెట్ భేటీ తీర్మానించింది. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏమంటే.. జగన్ ప్రభుత్వం తరచూ ప్రస్తావించే.. టెండర్లు.. రివర్సు టెండర్లు లాంటి చర్చలోకి వెళ్లకుండా ఇష్యూ క్లోజ్ కావటం.
2021-12(డిసెంబరు, 2021)
ఏపీ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి 4667 మెగావాట్లు.. అజూర్ పవర్ ఇండియా లిమిటెడ్ నుంచి 2333 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు తొలి ఒప్పందం కుదిరింది. అజూర్ నుంచి తీసుకోవాల్సిన విద్యుత్ ను కూడా అదానీ నుంచి తీసుకునేలా సెకి తర్వాత ప్రతిపాదించింది.అందుకు ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పేసింది.
ఇక్కడ కొత్తగా వెలుగు చూసిన కొత్త విషయం ఏమంటే.. అదానీ.. అజూర్ లు పేరుకు మాత్రమే వేర్వేరు కంపెనీలు కానీ.. రెండూ ఒకటేనన్న విషయం తాజాగా వెల్లడవుతోంది. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇదే విషయాన్ని ప్రస్తావించటం గమనార్హం. సెకి నుంచి యూనిట్ కు రూ.2.49 చొప్పున చెల్లించేందుకు డీల్ చేసుకునే సమయానికి కొన్ని రాష్ట్రాలు ఇతర సౌర విద్యుత్ సంస్థల నుంచి యూనిట్ రూ.1.99 చొప్పున చెల్లింపులు జరిపేలా ఒప్పందం చేసుకోవటం గమనార్హం.
అదానీ.. అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మధ్య జరిగిన భేటీల వివరాలు చాలావరకు వెలుగు చూసింది లేదు. కానీ.. తాజా ఇష్యూ సందర్భంగా పలు అంశాల్ని అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. అన్నింటికి మించి భేటీలకు సంబంధించి తేదీలతో సహా వివరాలు వెల్లడికావటం చూస్తే.. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్యూలోకి వస్తారా? అన్నదిప్పుడు చర్చగా మారింది. ముడుపులు చెల్లించే క్రమంలో ఎవరెవరు? ఎక్కడెక్కడ? ఎలా కలిశారు? ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయో ఆధారాలతో సహా వెల్లడించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.