Begin typing your search above and press return to search.

అదానీ, రేవంత్.. మధ్యలో రాహుల్.. చర్చకు దారితీసిన ఫ్లెక్సీ

అయితే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు హాజరవుతున్న రాహుల్ కోసం నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి.

By:  Tupaki Desk   |   5 Nov 2024 8:59 AM GMT
అదానీ, రేవంత్.. మధ్యలో రాహుల్.. చర్చకు దారితీసిన ఫ్లెక్సీ
X

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కులగణన మీదే రాజకీయాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కులగణన చేపడుతోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను ప్రారంభిస్తోంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మొత్తంగా 48వేల మంది సిబ్బంది ప్రభుత్వం ఈ సర్వే నిర్వహిస్తోంది. 75 ప్రశ్నలతో సిబ్బంది వివరాలను సేకరించబోతున్నారు.

ఎన్నికల సందర్భంలో కులగణన చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రచారం చేపట్టింది. దాంతో చెప్పినట్లుగానే ఇప్పుడు సర్వే చేపడుతోంది. అయితే.. సర్వేకు ముందే ఈ రోజు పలువురు మేధావులు, పౌరహక్కులు, ప్రజాసంఘాల నాయకులు, కులసంఘాలతో బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేపై ఆరా తీసేందుకు ఆయన హైదరాబాద్ వస్తున్నారు.

ఈ రోజు సాయంత్రం 4.45 గంటలకు ప్రత్యేక విమానంలో రాహుల్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బోయిన్‌పల్లిలోని గాంధీ నాలెడ్జ్ సెంటర్‌కు చేరుకుంటారు. 5.30 నుంచి 6.30 వరకు సదస్సులో మేధావులతో చర్చిస్తారు. కులగణనపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. కులగణన ద్వారా జరిగే ప్రయోజనాలనూ వారికి వివరిస్తారు. సదస్సు ముగిశాక వెంటనే ఢిల్లీ వెళ్లిపోతారు.

అయితే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు హాజరవుతున్న రాహుల్ కోసం నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. కాగా.. అందులో అదానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి రాహుల్‌కు స్వాగతం చెబుతున్నట్లుగా ఉన్న ఫ్లెక్సీలు ఇప్పుడు కలకలం సృష్టించాయి. ప్రస్తుతం ఆ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఖరికి వ్యతిరేకంగా ఇటీవల రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించింది. అంతేకాదు.. ఇటీవల అదానీ సైతం రూ.100 కోట్ల విరాళం సైతం అందించారు. మరోవైపు.. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం మోడీతో అదానీకి ముడిపెడుతూ నిత్యం విమర్శలు చేస్తూనే ఉంది. దేశాన్ని అదానీకి దోచిపెడుతున్నారని రాహుల్ ఎన్నో సందర్భాల్లో విమర్శలు చేశారు. కానీ.. రాష్ట్రానికి వచ్చేసరికి పరిస్థితి విభిన్నంగా ఉంది. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిపై నిలదీస్తున్నాయి. ఇదే క్రమంలో రాహుల్ గాంధీకి స్వాగతం చెబుతూ అదానీ, రేవంత్‌తో కలిసి ఉన్న ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై మరింత గందరగోళానికి దారితీసింది.