అంబానీకి అతిచేరువలో అదానీ... మూడు రోజుల్లో జరిగిందిదే
అవును... దిగ్గజ వ్యాపారవేత్త గౌతం అదానీ కంపెనీల షేర్లు వరుస సెషన్లలో అప్పర్ సర్క్యూట్ కొడుతుండటంతో ఆయన సంపద లక్షల కోట్లు పెరుగుతోంది.
By: Tupaki Desk | 6 Dec 2023 1:12 PM GMTఅదానీ గ్రూప్ ఛైర్మన్, దిగ్గజ వ్యాపారవేత్త గౌతం అదానీ ఇప్పుడు ప్రపంచంలోని 15వ ధనవంతుడిగా నిలిచారు. ఒక్క మూడు రోజుల్లో జరిగిన పరిణామలు అంబానికి అతిచేరువలో అదానీని తీసుకెళ్లాయి. దీంతో అదానీ మళ్లీ ఫాంలోకి వచ్చేసినట్లే అనే కామెంట్లు వ్యాపార వర్గాల్లో నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన సంపద లక్షల కోట్లు పెరగడం గమనార్హం. దీంతో ప్రపంచ ధనవంతుల జాబితాలో అంబానీకి సమీపంలోకి వెళ్లారు.
అవును... దిగ్గజ వ్యాపారవేత్త గౌతం అదానీ కంపెనీల షేర్లు వరుస సెషన్లలో అప్పర్ సర్క్యూట్ కొడుతుండటంతో ఆయన సంపద లక్షల కోట్లు పెరుగుతోంది. ఈ క్రమంలో 10 కంపెనీలు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన నేపథ్యంలో... గత 3 రోజుల వ్యవధిలో వీటి స్టాక్స్ ఒక్కొక్కటీ గరిష్టంగా 50 శాతానికిపైగా పెరిగింది. ఇలా అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ పెరగడంతో పాటు.. ఆయన వ్యక్తిగత సంపద రికార్డు స్థాయికి పెరిగింది.
దీంతో ప్రపంచ కుబేరుల్లో టాప్ 20 జాబితాలో అదానీ తిరిగి వచ్చారు. బ్లూం బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అదానీ ఇప్పుడు 82.5 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోని 15వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 3 రోజుల కిందట ఆయన 20వ స్థానంలో ఉండటం గమనార్హం. మంగళవారం నాటి ట్రేడింగ్ లో అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ 11 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుని రూ.13.8 లక్షల కోట్లకు చేరుకుంది.
ఆ మూడురోజులైన సోమవారం, మంగళవారం, బుధవారం అదానీకి బాగా కలిసివచ్చేశాయి. ఆ మూడురోజుల సెషన్లలో స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరడంతోపాటు.. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు అప్పర్ సర్క్యూట్లు కొట్టడం అతనికి భారీగా కలిసొచ్చింది. దీంతో అంతక ముందు వరకు 50 బిలియన్ డాలర్లుగా ఉన్న అదానీ సంపద... ప్రస్తుతం 82.5 బిలియన్ డాలర్లకు చేరింది.
ఇది ఇండియన్ కరెన్సీలో రూ. 6.87 లక్షల కోట్లు కాగా... బుధవారం ఒక్కరోజే ఆయన సంపద 12.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. ఒక లక్ష కోట్లు) మేర పెరిగింది. దీంతో ప్రపంచం జాబితాలో 15వ స్థానంతోపాటు ఆసియాలో రెండో స్థానానికి చేరుకున్నారు. ఈ జాబితాలో ప్రస్తుతం అంబానీ ఆసియాలో ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతుండగా... ప్రపంచ కుబేరుల జాబితాలో 91.4 బిలియన్ డాలర్లతో 13వ స్థానంలో ఉన్నారు.
ఫోర్బ్స్ జాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్:
మరోవైపు అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ప్రతి ఏడాది విడుదల చేసే ప్రపంచంలోని వంద మంది శక్తిమంతమైన మహిళల జాబితాలో నలుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి చోటు దక్కించుకుని 32వ స్థానంలో నిలిచారు.
ఆమె తోపాటు మరో ముగ్గురు భారతీయ మహిళల్లోనూ... హెచ్.సీ.ఎల్. కార్పోరేషన్ సీఈవో రోష్నీ నాదర్ మల్హోత్రా (60వ స్థానం), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ సోమ మొండల్ (70వ స్థానం), బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా(76వ స్థానం)లో ఉన్నారు.