Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్.. అదానీ బొగ్గు కుంభకోణం?

ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ టైమ్స్‌ కథనాన్ని ఉదహరిస్తూ మనదేశంలోని మీడియాల్లోనూ కథనాలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   24 May 2024 5:41 AM GMT
హాట్ టాపిక్.. అదానీ బొగ్గు కుంభకోణం?
X

ప్రముఖ పారిశ్రామికవేత్త, అపర కుబేరుడు ఆదానీకి చెందిన కంపెనీకి బొగ్గు కుంభకోణంలో ప్రమేయం ఉందంటూ లండన్ కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్‌ రిపోర్ట్ చేసింది. దీంతో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఈ విషయం మారుమోగుతుంది. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ టైమ్స్‌ కథనాన్ని ఉదహరిస్తూ మనదేశంలోని మీడియాల్లోనూ కథనాలు వచ్చాయి.

అవును... నాణ్యతలేని బొగ్గును కారుచౌకగా కొనుగోలు చేసి దాన్ని హై-గ్రేడ్‌ క్వాలిటీ / సుపీరియర్ క్వాలిటీ బొగ్గుగా నమ్మించి ఎక్కువ ధరకు విక్రయించిందని.. ఫలితంగా ప్రభుత్వ రంగ విద్యుత్తు కంపెనీ నుంచి సుమారు రూ.3 వేల కోట్లు సంపాదించిందంటూ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ (ఓసీసీఆర్పీ), ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనాల్లో వెల్లడించింది.

ఆ కథనం ప్రకారం 2014లో ఇండోనేషియాలోని ఒక కంపెనీ నుంచి అదానీ కంపెనీ దాదాపు 69,925 మెట్రిక్‌ టన్నుల నాణ్యతలేని బొగ్గును కొనుగోలు చేసింది. దీని ధర చాలా తక్కువ. అయితే అదే బొగ్గును హై-గ్రేడ్‌ క్వాలిటీ బొగ్గుగా చూపిస్తూ తమిళనాడు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న టీ.ఏ.ఎన్‌.జీ.ఈ.డీ.సీ.వో విద్యుత్తు సంస్థకు మూడు రెట్లు ధర పెంచి విక్రయించిందట.

ఈ మేరకు ఓసీసీఆర్పీ, ఫైనాన్షియల్‌ టైమ్స్‌ నివేదికలో ఉటంకిస్తూ కొన్ని ఇన్‌ వాయిస్‌ పత్రాలను ఈ సందర్భంగా విడుదల చేశాయి. ఇందులో భాగంగా... ఒక్కో టన్ను బొగ్గును 26 డాలర్లకు కొని 86 డాలర్లకు అమ్ముతున్నట్లు పేర్కొంది. ఇలా 2014-2016 మధ్య అదానీ కంపెనీ కారణంగా తమిళనాడు ప్రభుత్వ విద్యుత్ సంస్థకు మొత్తంగా రూ.3 వేల కోట్ల మేర నష్టంవాటిల్లినట్టు 2018లో అరప్పూర్‌ అయక్కమ్‌ అనే ఎన్జీవో సంస్థ ఆరోపించిన విషయాన్ని ఓసీసీఆర్పీ గుర్తుచేసింది!

అదానీ కంపెనీ బొగ్గు అక్రమాలతో ప్రజలపై ఆర్థికభారం పడటంతో పాటు వారి ప్రాణాలు కూడా ప్రమాదంలోకి వెళ్తున్నాయని పర్యావరణ నిపుణులు మండిపడుతున్నారు. నాణ్యతలేని బొగ్గుతో విద్యుదుత్పత్తి తక్కువగా జరిగి.. పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని ఆస్ట్రేలియాకు చెందిన క్లెమెట్‌ ఎనర్జీ ఫైనాన్స్‌ వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌ టిమ్‌ బక్లే అంటున్నారు.

ఫలితంగా విద్యుత్తు ఛార్జీలు పెరిగి భారత్‌ లోని పేదలు మరింత పేదరికంలోకి కూరుకుపోవడంతోపాటు.. వారి ఆరోగ్యాలు ఇబ్బందుల్లో పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.