అదానీ సంచలన నిర్ణయం... సరికొత్త వ్యాపారంలోకి అడుగులు!
ఊహించని రీతిలో షేర్ లు పడిపోవడంతో... ధనవంతుల జాబితాలో కూడా అదానీ పేరు కిందకి పడిపోవడం మొదలైంది
By: Tupaki Desk | 26 Feb 2024 6:40 AM GMTగత ఏడాది అమెరికా ఆధారిత షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణల సమయంలో అదానీ గ్రూప్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఊహించని రీతిలో షేర్ లు పడిపోవడంతో... ధనవంతుల జాబితాలో కూడా అదానీ పేరు కిందకి పడిపోవడం మొదలైంది. అయితే... ఇటీవల ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతం ఆదానీ 100 బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరారు. దీంతో రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారో ఏమో కానీ... సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు!
అవును... ఆఫ్టర్ స్మాల్ గ్యాప్ అదానీ ఈజ్ బ్యాక్ అన్నట్లుగా ఇటీవల తిరిగి పుంజుకుంటున్న గౌతం అదానీ... సరికొత్త వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే... ఇన్ ఫ్రా, విమానయానం, పవర్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఉన్న అదానీ మరిన్ని సరికొత్త వ్యాపారాల్లోకి అడుగుపెట్టేందుకు ప్లాన్స్ చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల్లోకి ఎంటరవ్వాలని యోచిస్తుందని తెలుస్తుంది.
మార్కెట్ క్యాపిటల్ పరంగా చూస్తే ఇండియాలో మూడో అతిపెద్ద వ్యాపార సంస్థగా ఉన్న అదానీ గ్రూపు.. తాజాగా ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి సారించిందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఉబెర్ టెక్నాలజీస్ తో వ్యూహాత్మక భాగస్వామ్యంతో పని చేస్తోందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఉబర్ టెక్నాలజీస్ రైడ్ హెయిలింగ్ ప్లాట్ ఫారంలో దాని ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లను ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకుందని అంటున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఉబెర్ సీఈవో దారా ఖోస్రోషాహితో సమావేశమయ్యారు. వీరి సమావేశంలో వీరి మధ్య ఈ విషయంపై చర్చలు సాగినట్లు తెలుస్తుంది. అదానీ కార్లను కొనుగోలు చేసి, వాటిని బ్రాండ్ చేసి ఉబర్ నెట్ వర్క్ లో చేర్చుతుంది. దీంతో అదాని కొత్త కొత్త లక్ష్యాలతో సరికొత్త వ్యాపారంలోకి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ మార్కెట్ వర్గాల్లో మొదలైపోయింది.
కాగా... 2013లో దేశంలో అడుగుపెట్టిన ఉబర్.. ప్రస్తుతం సుమారు 125 నగరాల్లో తన సేవలను అందిస్తోంది. ఇదే సమయలో అదానీ – ఉబర్ భాగస్వామ్యం "అదానీ వన్" విస్తరణకు కూడా సహాయపడుతుందని తెలుస్తుంది! విమాన బుకింగ్, హాలిడే ప్యాకేజీలు, విమానాశ్రయ సేవలు, క్యాబ్ బుకింగ్ వంటి అనేక సేవలను ఉబర్ అందిస్తుండగా... రాబోయే 10 ఏళ్లలో దేశమంతటా గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని అదానీ గ్రూప్ భావిస్తుందని తెలుస్తుంది.