Begin typing your search above and press return to search.

అదానీ సలహాదారుకు కీలకపదవి అప్పగించుడేంది మోడీ సాబ్?

ప్రముఖ వ్యాపార దిగ్గజం అదానీకి కేంద్రంలోని మోడీ సర్కారుకున్న అనుబంధం గురించి తరచూ ఆరోపణలు.. విమర్శలు రావటం తెలిసిందే

By:  Tupaki Desk   |   15 Nov 2023 8:30 AM GMT
అదానీ సలహాదారుకు కీలకపదవి అప్పగించుడేంది మోడీ సాబ్?
X

ప్రముఖ వ్యాపార దిగ్గజం అదానీకి కేంద్రంలోని మోడీ సర్కారుకున్న అనుబంధం గురించి తరచూ ఆరోపణలు.. విమర్శలు రావటం తెలిసిందే. మిగిలిన ప్రభుత్వాలకు భిన్నంగా తనపై వచ్చే ఆరోపణల్ని.. విమర్శల్ని పెద్దగా పట్టించుకోని మోడీ సర్కారు అదానీకి సంబంధించి ఇప్పటివరకు మోడీ మాట్లాడింది లేదు. ఆ అవకాశాన్ని ఆయన ఇవ్వనూలేదు. మీడియాకు దూరంగా ఉంటూ.. ఎంపిక చేసిన మీడియాకు అది కూడా తాను కోరుకున్నట్లుగా ప్రోగ్రాం చేసే వారికే సమయాన్ని ఇస్తారన్న విమర్శ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే.. అదానీ విషయంలో మోడీ సర్కారు ఎంతటి ప్రేమాభిమానాల్ని ప్రదర్శిస్తుందన్న దానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్నిచెబుతున్నారు.

ఇప్పటికే అదానీ పరిశ్రమలకు కేంద్రం అనుచిత లబ్ధి కలిగిస్తుందన్న దుమారానికి బలం చేకూరే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీలో అదానీ గ్రూప్ సలహాదారుడ్ని నియమించుకోవటం గమనార్హం. ఇక్కడ పాయింట్ ఏమంటే.. జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటులో ఈ కమిటీనే సిఫార్సులు చేస్తుంది. అదానీ గ్రూపు ఇప్పుడు ఆరు ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపిన వేళ.. అదానీ సలహాదారుడ్ని కీలక కమిటీలో సభ్యుడిగా ఎంపిక చేయటాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి.

అదానీ సంస్థ ఆరు ప్లాంట్లకు ప్రతిపాదనలు పంపిన వేళ.. అదానీ సలహాదారుగా వ్యవహరించే జనార్దన్ చౌధరిని నియమిస్తూ మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవటం పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చింది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1500 మెగావాట్ ల తరాలి పంపింగ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మించటానికి అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రతిపాదనల్ని సమర్పించింది. అదానీకి సలహాదారుగా వ్యవహరించే జనార్దన్ ను జలవిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే కమిటీలో సభ్యుడిగా నియమించటాన్ని ప్రశ్నిస్తున్నారు.

తనపై వచ్చిన వివాదంపై జనార్దన్ స్పందిస్తూ.. గత నెల 17-18 తేదీల్లో జరిగిన సమావేశంలో అదానీ సంస్థకు సంబంధించిన ప్రతిపాదన వచ్చినందనే సమావేశంలో పాల్గొనలేదని పేర్కొనటం గమనార్హం. అయినా.. తాను అదానీ కంపెనీ ఉద్యోగిలా పే రోల్ లో లేనని చెప్పిన ఆయన.. అదానీకి సలహాదారుగా మాత్రమే ఉన్నట్లు చెప్పిన వైనం చూస్తే.. విషయం అర్థమవుతుంది. ఏమైనా.. అదానీ మీద మోడీ సర్కారుకున్న ప్రత్యేక ప్రేమాబిమానాలు తాజా ఎపిసోడ్ తో మరోసారి తేటతెల్లమయ్యేలా చేశారని చెబుతున్నారు.