స్టాక్ మార్కెట్లపై హిండెన్ బర్గ్ ఎఫెక్ట్... అదానీ సంపద ఎంత ఆవిరంటే..?
అదానీ గ్రూప్స్, సెబీ ఛైర్ పర్సన్ మాధబీపై హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 Aug 2024 7:33 AM GMTఅదానీ గ్రూప్స్, సెబీ ఛైర్ పర్సన్ మాధబీపై హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై ఇరు పక్షాల నుంచీ వివరణలు కూడా వచ్చాయి. అయినప్పటికీ హిండెన్ బర్గ్ సరికొత్త ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏమిటనే ఆందోళన చాలా మంది వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో అనుకున్నంతపనీ అయ్యింది. స్టాక్ మార్కెట్లపై హిండెన్ బర్గ్ ఎఫెక్ట్ పడింది.
అవును... దేశీయ స్టాక్ మార్కెట్లపై హిండెన్ బర్గ్ ఆరోపణల ప్రభావం స్పష్టంగా కనిపించింది. తాజాగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నాయి. అయినప్పటికీ సెబీ ఛైర్ పర్సన్ పై హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణల ప్రభావం సూచీలపై స్పష్టంగా పడింది. దీంతో... ఆరంభంలో సూచీలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.
ఈ నేపథ్యంలోనే బీ.ఎస్.ఈలో అదానీ స్టాక్స్ 7 శాతానికిపైగా నష్టపోవడంతో రూ.53 వేల కోట్ల సంపద ఆవిరైనట్లు చెబుతున్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్ ధర రూ.1656కు పడిపోగా.. అదానీ పవర్ 4 శాతం, విల్ మర్, ఎనర్జీ సొల్యూషన్స్, ఎంటర్ ప్రైజెస్ 3 శాతం చొప్పున నష్టాలు చవిచూస్తున్నాయి. ఇక నిఫ్టీలోని అదానీ పోర్ట్స్ 2 శాతం పడిపోయింది!
ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 240 పాయింట్ల నష్టంతో 79,465 వద్ద.. నిఫ్టీ 77 పాయింట్ల నష్టంతో 14,289 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక డాలర్ తో రూపాయి మారకం విలువ 83.95గా కొనసాగుతోంది.
కాగా... అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచడంకోసం దోహదపడిన అంతర్జాతీయ ఫండ్స్ లో సెబీ ఛైర్ పర్సన్ మాధబీ తో పాటు ఆమె భర్తకు వాటాలు ఉన్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిని సెబీ ఛైర్ పర్సన్ మాధబీ పురి బచ్ తీవ్రంగా ఖండించారు. అయినప్పటికీ హిండెన్ బర్గ్ ఆరోపణల ప్రభావం మార్కెట్ పై బలంగా పడింది!