అదానీ హవా షురూ: ఒక్క రోజులో రూ.లక్ష కోట్లు పెరిగింది!
టాప్ 20 సంపన్నుల జాబితాలో తాజాగా గౌతమ్ అంబానీ స్థానం 19 కావటం గమనార్హం.
By: Tupaki Desk | 30 Nov 2023 4:47 AM GMTఅదానీ సంస్థల అధినేత గౌతమ్అదానీ అంటే మాటలు కాదు. ఆయన హవా అంతా ఇంతా కాదు. ఆయనకు తగిలిన ఎదురుదెబ్బలు మరెవరికైనా తగిలి ఉంటే కుదేలు అయ్యేవారు. సవాళ్లు.. సమస్యలు ఎదురైన కొద్దీ మరింత బలపడటం గౌతమ్ అదానీ గొప్పగా చెప్పాలి. ఆ మధ్యన విడుదలైన హిండెన్ బర్గ్ రిపోర్టు దెబ్బకు గౌతమ్ అదానీ సంపద మంచు ముక్కలా కరిగిపోవటం తెలిసిందే. అయినప్పటికీ.. ఆ ఆరోపణల్ని ఎదుర్కొంటూ.. తన సత్తా చాటిన ఆయన.. తాజాగా తన హవాను మళ్లీ షురూ చేసినట్లుగా కనిపిస్తోంది.
కారణం.. బుధవారం అదానీ గ్రూప్ షేర్లు జోరందుకున్నాయి. దీని ఫలితంగా ఒక్క రోజులోనే రూ.లక్షకోట్లకు పైనే ఆయన కంపెనీల మార్కెట్ వాల్యూ రూ.లక్ష కోట్లకు చేరటం గమనార్హం. అంతేకాదు.. భారీగా పెరిగిన షేర్ల ధరలతో ఆయన వ్యక్తిగత సంపద సైతం 6.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. మన రూపాయిల్లో చెప్పాలంటే అక్షరాల రూ.54వేల కోట్ల మేర ఆయన సంపద పెరిగినట్లైంది.
ఈ నేపథ్యంలో ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరిగా మారారు. టాప్ 20 సంపన్నుల జాబితాలో తాజాగా గౌతమ్ అంబానీ స్థానం 19 కావటం గమనార్హం. ఆ స్థానంలో ఉన్న బిలియనీర్లు జూలియా ఫ్లెషర్ కోచ్ అండ్ ఫ్యామిలీ.. చైనాకు చెందిన జాంగ్ షన్షాన్.. అమెరికాకు చెందిన చార్లెస్ కోచ్ లను వెనక్కి నెట్టేసిన గౌతమ్ అంబానీ టాప్ 20 క్లబ్ లో చేరిపోయారు. ఈ విషయాన్ని బ్లూమ్ బెర్గ్ ఇండెక్స్ లో పేర్కొన్నారు
బుధవారం నాటికి అదానీ గ్రూప్ లోని పది కంపెనీల విలువ మొత్తం రూ.11.31 లక్షల కోట్లకు చేరింది. గత శుక్రవారంతో పోలిస్తే ఈ బుధవారం ఒక్క రోజే మార్కెట్ విలువ రూ.1.04 లక్షలకోట్లు పెరగటం విశేషం. హిండెన్ బర్గ్ రిపోర్టు తర్వాత ఇంత స్థాయిలో పెరగటం ఇదే. ఇంతకూ ఇంతలా అదానీ గ్రూప్ షేర్లకు ఊపు రావటానికి కారణం ఏమిటి? అన్నది చూస్తే.. తాజాగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలే కారణమని భావిస్తున్నారు.
హిండెన్ బర్గ్ రిపోర్టు నేపథ్యంలో అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలపై సెబీ విచారిస్తోంది. ఈ దర్యాప్తును కోర్టు పర్యవేక్షణలో సాగాలంటూ పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ఇటీవల సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సెబీని అనుమానించాల్సిన అవసరంలేదని.. అందుకు తగ్గ ఆధారాలు ఏవీ తమ ముందు లేవన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. హిండెన్ బర్గ్ నివేదికలోని అంశాల్ని వాస్తవాలుగా కోర్టు పరిగణించాల్సిన అవసరం లేదంది. ఈ కేసు తీర్పును రిజర్వు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోఅదానీ గ్రూప్ షేర్లు భారీగా ర్యాలీ అయ్యాయి.