నన్ను చూస్తూ ఉండటమే నా భార్యకిష్టం : అదర్ పూనావాలా
వారానికి 90 గంటలు పనిచేయాలన్న ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణిన్ వ్యాఖ్యలపై విమర్శలు కొనసాగుతున్నాయి.
By: Tupaki Desk | 12 Jan 2025 1:38 PM GMTవారానికి 90 గంటలు పనిచేయాలన్న ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణిన్ వ్యాఖ్యలపై విమర్శలు కొనసాగుతున్నాయి. క్వాంటటీ కంటే క్వాలిటీ ముఖ్యమంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ వ్యాఖ్యలను మిగిలిన పారిశ్రామిక వేత్తలు తప్పుబడుతున్నారు.
ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణియన్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలను కోట్ చేస్తూ ఎక్కువ పని గంటల ప్రతిపాదనపై విమర్శలు గుప్పించారు. ‘‘నిజమే, నా భార్య కూడా నేను మంచివాడిని అనుకుంటుంది. ఆదివారం నన్ను చూస్తూ ఉండటం ఆమెకు ఇష్టం. క్వాంటిటీ కంటే క్వాలిటీనే ముఖ్యం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలంటూ’’ పూనావాలా ట్వీట్ చేశారు.
అంతకుముందు ఆనంద్ మహీంద్ర కూడా ఎల్ అండ్ టీ చైర్మన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. 48, 70, 90 ఇలా ఎన్నిగంటలు పనిచేశామన్నది ముఖ్యం కాదు. ఉత్పాదకతే ప్రధానమని ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యానించారు. నా భార్య ఎంతో మంచిది. ఆమెను చూస్తూ ఉండటం నాకెంతో ఇష్టం అంటూ ఆనంద్ మహేంద్రా ట్వీట్ చేశారు.
ఇటీవల నిర్వహించిన ఎల్ అండ్ టీ ఉద్యోగుల సమావేశంలో చైర్మన్ సుబ్రహ్మణియన్ 90 గంటల పనిపై వ్యాఖ్యానించి కలకలం రేపారు. తమ సంస్థ ఉద్యోగులు ఎక్కువగా కష్టపడాలని కోరుకున్న ఆయన ఉద్యోగులు ఆదివారాలు కూడా పనిచేయాలని సూచించారు. అంతటితో ఆగకుండా ఎంతసేపు ఇంట్లో కూర్చొని భార్యలను చూస్తుంటారు అంటూ ఉద్యోగుల వ్యక్తిగత జీవితంపైనా కామెంట్స్ చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారిశ్రామిక వేత్తలు కూడా సుబ్రహ్మణియన్ మాటలను తప్పుబడుతుండటంతో ఎల్ అండ్ టీ చైర్మన్ ఒంటరి అయ్యారు.
కాగా, వారానికి 90 గంటలు పనిచేయాలన్న సుబ్రహ్మణియన్ ఏడాదికి రూ.51 కోట్లు వేతనంగా తీసుకుంటుంటారు. ఆయన బేసిక్ శాలరీ రూ. 3.6 కోట్లు, ప్రీరిక్విసైట్స్ రూ.1.67 కోట్లు, కమీషన్ రూ.35.28 కోట్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద మరో రూ.10.5 కోట్లు తీసుకున్నారు. ఎల్ అండ్ టీలో సగటు ఉద్యోగి శాలరీ రూ.9.55 లక్షలు. దీంతో పోల్చుకుంటే చైర్మన్ వేతనం 534 రెట్లు ఎక్కువ అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.