Begin typing your search above and press return to search.

బీజేపీలోకి అడారి.. టీడీపీ నేతలకు చెక్ చెప్పినట్లేనా?

దీంతో అవినీతి కేసులు నమోదు కాకుండానే చైర్మన్ ఆనంద్ కుమార్ సురక్షితంగా బయటపడినట్లు భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 Dec 2024 9:30 AM GMT
బీజేపీలోకి అడారి.. టీడీపీ నేతలకు చెక్ చెప్పినట్లేనా?
X

విశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ ను టార్గెట్ గా చేసిన టీడీపీ నేతలకు ఊహించిన షాక్ తగిలింది. డెయిరీలో అవినీతి వ్యవహారాలపై చర్యలకు పావులు కదిపిన నేతల జోరుకు అడ్డుకట్ట వేస్తూ చైర్మన్ ఆనంద్ కుమార్ బీజేపీని ఆశ్రయించారు. దీంతో అవినీతి కేసులు నమోదు కాకుండానే చైర్మన్ ఆనంద్ కుమార్ సురక్షితంగా బయటపడినట్లు భావిస్తున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఈ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు అంతా మూకుమ్మడిగా విశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ ను టార్గెట్ చేయగా, ఆయన తనను తాను రక్షించుకునేందుకు బీజేపీ పెద్దలను ఆశ్రయించి, కమలం కండువా కప్పుకున్నారు. దీంతో టీడీపీ నేతలు భవిష్యత్ వ్యూహరచనపై ఆసక్తి నెలకొంది. ఒకప్పుడు తమ సహచరుడైన విశాఖ డెయిరీ చైర్మన్ 2019లో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఆ పార్టీ పెద్దల అండతో అవినీతికి పాల్పడ్డారని, డెయిరీ రైతులకు నష్టం కలిగేలా వ్యవహరించారని టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో కూటమి అధికారంలోకి రాగానే డెయిరీ కార్యకలాపాలపై నిఘా వేసి ఉంచారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఓ అడుగు ముందుకేసి విశాఖ డెయిరీపై శాసనసభా సంఘాన్ని నియమించి విచారణకు ఆదేశించారు. ఈ నెల తొలివారంలో విశాఖలో పర్యటించిన సభా సంఘం డెయిరీ ఎండీతోపాటు ఉద్యోగులను విచారించింది. ఆ సమయంలో చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో మరోమారు విచారణకు వస్తామని పేర్కొంది.

ఈ పరిస్థితుల్లో వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ డెయిరీ చైర్మన్, డైరెక్టర్లు టీడీపీలోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే టీడీపీ నేతలు అడ్డుపుల్ల వేయడంతో ఆనంద్ కుమార్ రూటు మార్చారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్వారా బీజేపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు. ఢిల్లీ పెద్దల అండ లభించడంతో ఆనంద్ కుమార్ ఇప్పుడు కూటమి భాగస్వామిగా మారారు. దీంతో ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరిపిస్తుందా? లేక నిలిపివేస్తుందా? అనేది చర్చకు తావిస్తోంది.

విశాఖ డెయిరీపై గత ఆర్నెల్లుగా కూటమి నేతలు ఎన్నో ఆరోపణలు చేశారు. కంపెనీ చట్టం ప్రకారం డెయిరీ చైర్మన్, డైరెక్టర్లు ఇదే తరహా మరొకటి చేయకూడదు. కానీ చైర్మన్‌ ఆనంద్‌ మాత్రం హైదరాబాద్‌లో విశాఖ మిల్క్‌ ప్రొడక్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే పేరుతో డెయిరీ వ్యాపారం చేస్తున్నట్లు కూటమి నేతలు చెబుతున్నారు. అదేవిధంగా తన సొంత సంస్థకు విశాఖ డెయిరీ నుంచి రోజూ 15 వేల లీటర్ల పాలు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రైతుల కోసం ఏర్పాటు చేసిన డెయిరీ ఆసుపత్రిని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి లీజుకిచ్చారని, ఆ ఆస్పత్రిలో రైతులకు ఎలాంటి వైద్య సేవలు అందడం లేదని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా గత ఎన్నికల సమయంలో తన తరఫున ప్రచారానికి డెయిరీ నిధులను ఉద్యోగులను వాడుకున్నారని, సిద్ధం సభలకు డెయిరీ నిధులను ఖర్చు చేశారని చెబుతున్నారు. అదేవిధంగా డెయిరీ స్థలాన్ని తన సొంత కుటుంబ సభ్యుల పేరున మార్చుకున్నారని మరో అభియోగం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే తనకు ముప్పు అని భావించిన చైర్మన్ ఆనంద్ కుమార్ చాలా జాగ్రత్తగా పావులు కదిపారు. ఒకప్పుడు తాను టీడీపీలో పనిచేసినా, ఆ పార్టీ నేతలు కక్ష కట్టినట్లు వ్యవహరిస్తుండటంతో బీజేపీ పెద్దల అండ ఉంటే మంచిదని భావించి అటు నుంచి నరుక్కొచ్చారు.