అద్దంకిని పక్కన పెట్టిన కారణమిదేనా ?
ఎంఎల్ఏ కోటాలో ఎంఎల్సీల జాబితా నుండి చివరి నిముషంలో అద్దంకి దయాకర్ ను కాంగ్రెస్ అధిష్టానం పక్కనపెట్టేసింది
By: Tupaki Desk | 18 Jan 2024 8:33 AM GMTఎంఎల్ఏ కోటాలో ఎంఎల్సీల జాబితా నుండి చివరి నిముషంలో అద్దంకి దయాకర్ ను కాంగ్రెస్ అధిష్టానం పక్కనపెట్టేసింది. మొదట్లోనేమో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లు ఖరారైనట్లు విపరీతమైన ప్రచారం జరిగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ ను అద్దంకి త్యాగం చేశారు. దానికి ప్రతిఫలంగా ఎంఎల్సీ ఇస్తోందనే ప్రచారం పెరిగిపోయింది. దాంతో నేతలు, క్యాడర్ కూడా ఫుల్లూగా హ్యాపీ ఫీలయ్యారు.
అయితే చివరినిముషంలో అద్దంకి ప్లేసులోకి మహేష్ కుమార్ గౌడ్ చేరారు. ఎంఎల్ఏ కోటాలో ఎంఎల్సీ అభ్యర్ధులుగా బల్మూరి, గౌడ్ పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. చివరి నిముషంలో అద్దంకిని ఎందుకు తప్పించారనే విషయంలో ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. అద్దంకిని తప్పించినందుకు రెండు మూడు కారణాలను పార్టీవర్గాలు ప్రస్తావిస్తున్నాయి. అవేమిటంటే అద్దంకికి పీసీసీ అధ్యక్ష పదవి రాబోతోందట. అలాగే కేబినెట్ ర్యాంకుండే కార్పొరేషన్ పదవిని ఇవ్వబోతున్నారన్నది రెండోది. ఇక తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ నుండి పోటీ చేయబోతున్నారన్నది మూడోది.
నిజానికి ఎంఎల్సీతో పోల్చుకుంటే క్యాబినెట్ ర్యాంకు తో కార్పొరేషన్ పదవి అన్నది చిన్నదనే అనుకోవాలి. ఇక పీసీసీ అధ్యక్ష పదవి అన్నది అధికారంలో ఉన్నపుడు ఆ పదవికి పెద్దగా గుర్తింపుండదు. పైగా రేవంత్ లాంటి దూకుడు స్వభావం ఉన్న నేత ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పీసీసీ అధ్యక్షపదవి కేవలం అలంకారప్రాయమే అవుతుంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇదే పీసీసీ అధ్యక్ష పదవికి బాగా ప్రాముఖ్యత ఉంటుంది. నిర్ణయాలు అధిష్టానంతో చర్చించిన తర్వాతే తీసుకోవాల్సొచ్చినా అమలు చేయాల్సింది పీసీసీ అధ్యక్షుడే కాబట్టి బాగా ఇంపార్టెన్స్ ఉంటుంది.
ఇక వరంగల్ పార్లమెంటులో పోటీ విషయం తీసుకుంటే ఆ సీటిచ్చి అతను గెలుచుకుంటే అది మంచిదే. ఎందుకంటే... ఎమ్మెల్సీ కంటే అదే బెటర్. పైగా రేవంత్ కుఅనుకూలుడు అయిన దయాకర్ ఢిల్లీలో తన మనిషిగా నిత్యం అందరితో టచ్ లో ఉండే అవకాశం ఉంటుంది.