వైఎస్ జగన్ దమ్ముకు బీజేపీ ఎమ్మెల్యే సవాల్!
కూటమి ప్రభుత్వం కొలువుదీరి నాలుగు నెలల సమయం పూర్తైనా హామీలు అమలుచేయలేదని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శిస్తున్నారు.
By: Tupaki Desk | 7 Oct 2024 2:53 PM GMTఎన్నికల సమయంతో సంబంధం లేకుండా, ఏ పరిస్థితులతోనూ పట్టింపు లేకుండా అన్నట్లుగా ఏపీలో రాజకీయం నిత్యం హాట్ టాపిక్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం కొలువుదీరి నాలుగు నెలల సమయం పూర్తైనా హామీలు అమలుచేయలేదని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శిస్తున్నారు.
ఇదే సమయంలో... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా చేసినపాపం గత ప్రభుత్వానిదే అని కూటమి నేతలు విరుచుకుపడుతున్నారు. ఇలా అధికార, విపక్ష నేతల మధ్య హామీల అమలుల విషయంలోనూ, ఆర్థిక పరిస్థితి విషయంలోనూ విమర్శలు, ప్రతివిమర్శల పర్వం నడుస్తుంది. ఈ సమయంలో జగన్ కు సవాల్ విసిరారు బీజేపీ ఎమ్మెల్యే.
అవును... వైసీపీ అధ్యక్షుడు జగన్ కు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి. టీడీపీ నేత భూపేష్ రెడ్డితో కలిసి జమ్మలమడుగులో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో స్థానిక వైసీపీ నాయకులు తనకు ఏమాత్రం సరితూగరని చెప్పిన ఆదినారాయణరెడ్డి.. ధమ్ముంటే నేరుగా జగనే తనపై పోటీచేయాలని అన్నారు. వైసీపీ నేతలు రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
ప్రభుత్వ స్థలాలను స్థానిక వైసీపీ నాయకులు కబ్జా చేశారని.. వాటన్నింటినీ బట్టబయలు చేస్తానని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో సంక్రాంతి నాటికి రాజోలి జలాశయ నిర్మాణం, టిడ్కో ఇళ్ల పంపిణీ, గండికోట ముంపు పరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టినట్లు ఆదినారాయణరెడ్డి తెలిపారు.