ఆదిత్య ఎల్-1 ప్రాజెక్టులో ఉత్తరాంధ్ర కుర్రాడి ప్రతిభ అదుర్సు
అంతరిక్ష రంగంలో దూసుకెళుతోంది భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో.
By: Tupaki Desk | 3 Sep 2023 6:13 AM GMTఅంతరిక్ష రంగంలో దూసుకెళుతోంది భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో. మొన్నటికి మొన్న చంద్రయాన్ 3ను సక్సెస్ ఫుల్ చేయటం ఒక ఎత్తు అయితే.. అంచనాలకు ఏ మాత్రం తగ్గని రీతిలో చంద్రుడిపై ల్యాండ్ అయిన రోవర్ విజయవంతంగా సేవల్ని అందించటం తెలిసిందే. యావత్ దేశ ప్రజలు చంద్రయాన్ 3ను సక్సెస్ నుంచి ఇంకా బయటకురాని వేళలోనే.. మరో అద్భుత ప్రయోగానికి తెర తీసింది ఇస్రో. చందమామలోని కొత్త విషయాల్ని బయటకు తెస్తున్న చంద్రయాన్ 3 ప్రయోగానికి మించినట్లుగా.. సూరీడు గుట్టుమట్ల లెక్క తేల్చేందుకు ఆదిత్య ఎల్ 1 పేరుతో ప్రయోగాన్ని శనివారం విజయవంతంగా నిర్వహించటం తెలిసిందే.
ఈ ప్రయోగం సక్సెస్ లో కీలక భూమికను పోషించిన వారు పలువురున్నారు.వారిలో మన తెలుగోడు ఒకడు కీలక పాత్ర పోషించాడు. యువకుడైన అతడే.. మనోజ్ వర్మ. ఉత్తరాంధ్రకు చెందిన ఈ కుర్రాడు ఆదిత్య ఎల్1 ప్రాజెక్టులో ‘సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్’ను రూపొందించటంలో కీ రోల్ ప్లేచేసినట్లుగా చెబుతున్నారు.ఈ ప్రయోగం విజయవంతంగా కక్ష్యలోకి చేరుకోవటంతో యావత్ దేశం పులకరించిపోయింది. సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న దేశ ప్రజలు.. ఈ ప్రయోగంలో కీలక్ పాత్రలు పోషించిన వారిని అభినందిస్తోంది.
ఈ ఉత్తరాంధ్ర కుర్రాడి బ్యాక్ గ్రౌండ్ ను చూస్తే.. తండ్రి గరివిడిలోని ఫేకర్ పరిశ్రమలో రా మెటీరియల్స్ విభాగానికి డిప్యూటీ మేనేజర్ గా పని చేశారు. తల్లి అప్పలకొండమ్మ ఇంటికే పరిమితమయ్యారు. ఒక ప్రైవేటుస్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్న మనోజ్.. అనంతరం కోల్ కతాలోని ఆస్ట్రనామికల్ ఇన్ స్ట్రుమెంటేషన్ వర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ లో పీహెచ్ డీ పూర్తి చేశారు.
ఈ క్రమంలో ఆదిత్యఎల్1 ప్రాజెక్టులో భాగమైన అతడు.. ప్రయోగంలో కీలక భూమిక పోషించే సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ను రూపొందించటంలో కీలక భూమిక పోషించాడు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇస్రోతో పాటు ఐయూసీఏఏ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పని చేశాడు. తాము ప్రయోగించిన ఆదిత్యఎల్1 ఉపగ్రహం సూర్యునిపై మరిన్ని ఆసక్తికర విషయాల్నితెలియజేయటం ఖాయమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు మనోజ్ వర్మ. దేశానికి గర్వకారణమైన ఆదిత్య ఎల్ 1 ప్రయోగంలో కీ రోల్ ప్లే చేసిన ఉత్తరాంధ్ర కుర్రాడ్ని తెలుగువారంతా మనసారా అభినందిద్దాం.