Begin typing your search above and press return to search.

ఆదిత్య ఎల్‌ - 1 సెల్ఫీ... పోలా.. అద్దిరిపోలా!

విశ్వ రహస్యాలను, ఆవిర్భావాన్ని, సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో కొద్ది రోజుల క్రితం ఆదిత్య–ఎల్‌ 1 ను విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Sep 2023 9:38 AM GMT
ఆదిత్య ఎల్‌ - 1 సెల్ఫీ... పోలా.. అద్దిరిపోలా!
X

విశ్వ రహస్యాలను, ఆవిర్భావాన్ని, సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో కొద్ది రోజుల క్రితం ఆదిత్య–ఎల్‌ 1 ను విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. 1,500 కిలోల బరువున్న ఉపగ్రహం సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో సౌర ప్రభావంపై అధ్యయనం చేస్తుంది. భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజ్‌ పాయింట్‌ 1 (ఎల్‌ 1) చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ కక్ష్యలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సెప్టెంబరు 2న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ప్రయోగం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే రెండోసారి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని విజయవంతంగా చేపట్టారు. ఈ విన్యాసంతో ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహం 282కి.మీ x 40,225 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశించింది. తదుపరి కక్ష్య పెంపు విన్యాసాన్ని సెప్టెంబరు 10న చేపడతామని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఆదిత్య–ఎల్‌ 1 ఉపగ్రహం నాలుగు నెలలపాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న ‘ఎల్‌1’ (లాంగ్రేజ్‌ పాయింట్‌) పాయింట్‌ ను చేరుకోనుంది. దీంతో భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రదేశంలోకి భారత్‌ చేరుకోవడం ఇదే తొలిసారి అవుతుంది. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాల్లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలుంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో సూర్యుడిపై అధ్యయనం కోసం బయలుదేరిన ఆదిత్య–ఎల్‌ 1 సూర్యుడి దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఒక సెల్ఫీని క్లిక్‌ మనిపించింది. భూమిని, చంద్రుడిని, తనను ఒక సెల్ఫీ తీసుకుని ఆదిత్య శాటిలైట్‌ మురిసిపోయింది. భూమిని తీస్తుండగా దానికి సమీపంలోనే చంద్రుడు కూడా కనిపించాడు. ఈ అద్భుత దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ట్విట్టర్‌ లో షేర్‌ చేసింది.

కాగా సెప్టెంబరు 4వ తేదీన ఆదిత్య–ఎల్‌ 1 లోని కెమెరా ఈ సెల్ఫీ తీసినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ సెల్ఫీలో ఆదిత్య–ఎల్‌ 1లోని విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్, సోలార్‌ ఆల్ట్రా వయోలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ కూడా కనిపించడం విశేషం. దీంతో పాటు భూమి, చంద్రుడు ఒకేసారి కన్పించిన అరుదైన దృశ్యాలను కూడా ఆదిత్య ఎల్‌–1 తన కెమెరాలో బంధించింది. ఈ చిత్రాలతోపాటు వీడియోను కూడా ఇస్రో సోషల్‌ మీడియాలో నెటిజన్లతో పంచుకుంది. ‘భూమి–సూర్యుడి మధ్యలోని లాంగ్రేజ్‌ పాయింట్‌ (ఎల్‌ 1)కు ప్రయాణంలో ఆదిత్య–ఎల్‌ 1 తీసిన దృశ్యాలివి’ అని ఇస్రో ట్విట్టర్‌ లో పేర్కొంది.

కాగా ఆదిత్య–ఎల్‌ 1లోని విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌.. సూర్యుడి కరోనా, స్పెక్ట్రోస్కోపీని అధ్యయనం చేస్తుంది. అలాగే సూట్‌.. ఫొటోస్పియర్, క్రోమోస్పియర్‌ లను పరిశీలిస్తుంది. ఇందులో ఏడు రకాల పరిశోధన పరికరాలున్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్, క్రోమోస్పియర్‌ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయని ఇస్రో శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. అలాగే సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయంటున్నారు. వీటి వల్ల సౌర తుపానుల నుంచి అంతరిక్షంలోని ఉపగ్రహాలు, ఇతర పరిశోధనాశాలలను కాపాడుకోవడానికి వీలవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.