అయ్యన్నపై ఆదివాసీల రుసరుస!
స్పీకర్ అయ్యన్నపాత్రుడిది సుదీర్ఘ రాజకీయ అనుభవం. 1983లో రాజకీయాల్లోకి వచ్చిన అయ్యన్నపాత్రుడు.. ప్రస్తుత అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత సీనియర్ నేత.
By: Tupaki Desk | 4 Feb 2025 8:15 AM GMTస్పీకర్ అయ్యన్నపాత్రుడిది సుదీర్ఘ రాజకీయ అనుభవం. 1983లో రాజకీయాల్లోకి వచ్చిన అయ్యన్నపాత్రుడు.. ప్రస్తుత అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత సీనియర్ నేత. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుదీర్ఘ కాలం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఎంపీగానూ కొన్నాళ్లు సేవలందించారు. ఇప్పుడు స్పీకర్ గా ఉన్నారు. ఒక విధంగా రాష్ట్రంలో ముఖ్య పదువులు అన్నీ అనుభవించిన అయ్యన్నపాత్రుడు ఇటీవల కాలంలో అనుకోని వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా అప్పటి అధికార పార్టీ నేతలతో నువ్వానేనా అన్నట్లు తలపడిన అయ్యన్న ఇప్పుడు అనాలోచితంగానో.. అయాచితంగానో చేస్తున్న వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్నాయి.
విశాఖ జిల్లాలో రాజకీయాల్లో దాదాపు 40 ఏళ్లుగా కొనసాగుతున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇప్పటివరకు ప్రజలతో ఎలాంటి వివాదాలు పెట్టుకోలేదు. హుందాగా రాజకీయం చేస్తారనే పేరు తెచ్చుకున్నారు. మాస్ లీడరుగా అందరికీ దగ్గరయ్యారు. కానీ, ఇప్పుడు ఆదివాసీల ఆగ్రహాన్ని చవిచూడటం అయ్యన్నకు ఓ విధంగా షాక్ అంటున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు విశాఖ మన్యంలో మంటలు పుట్టిస్తున్నాయంటున్నారు. అయ్యన్న వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, లేదంటే ఈ నెల 12న బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు గిరిపుత్రులు. ఇంతకీ వారిలో అంతటి కోపాన్ని తెచ్చేలా అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది.
ఇటీవల విశాఖలో నిర్వహించిన పర్యాకట దినోత్సవంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. ఈ కార్యక్రమానికి స్పీకర్ తోపాటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మూడు జిల్లాల కలెక్టర్లు వెళ్లారు. ఈ సభలో పర్యాటక రంగం అభివృద్ధికి కొన్ని సూచనలు చేశారు అయ్యన్నపాత్రుడు. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో ఎన్నో పర్యాటక స్థలాలు ఉన్నాయని, అయితే వాటి అభివృద్ధికి అటవీ హక్కుల చట్టం 1/70 యాక్టు అడ్డు వస్తుందని వ్యాఖ్యానించారు. అభివృద్ధికి ఆటంకంగా మారిన అటవీ హక్కు చట్టాన్ని సడలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఏజెన్సీలో ఎవరూ పెట్టుబడి పెట్టలేని పరిస్థితి ఎదురవుతుందని, ఆ ప్రాంతంలో ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే గిరిజనుల పేరు పెట్టాల్సివస్తోందని అన్నారు. గిరిజనులకు ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కొందరు ఆదివాసీ నేతలు మండిపడుతున్నారు. తమ హక్కులను హరించడానికి అయ్యన్నపాత్రుడు ఎవరంటూ ప్రశ్నిస్తున్నారు. తక్షణం స్పీకర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుంటే ఈ నెల 12న మన్యం బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
సీనియర్ నేతగా ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు రాజకీయ జీవితంలో ఎన్నడూ ఈ తరహా రాజకీయ వివాదంలో చిక్కుకోలేదు. ప్రస్తుత పదవీకాలం తర్వాత రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తోన్న అయ్యన్న.. ఇప్పుడు అనావసర వివాదాల్లో చిక్కుకోవడం ఆయనకు మైనస్ గా చెబుతున్నారు. ప్రస్తుత పరిణామాల నుంచి ఆయన ఎలా బయటపడతారన్నది ఆసక్తిగా మారింది.