Begin typing your search above and press return to search.

అయోధ్య గుడికి రూ.2,100 కోట్లు చెక్కు... ట్విస్ట్ ఏంటంటే...?

ఇదే సమయంలో... శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు పేరిట బ్యాంక్ ఖాతాలో రూ.2,600 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నట్లు చంపత్ రాయ్ తెలిపారు.

By:  Tupaki Desk   |   24 Aug 2024 6:41 AM GMT
అయోధ్య గుడికి రూ.2,100 కోట్లు చెక్కు... ట్విస్ట్ ఏంటంటే...?
X

వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ అయోధ్యలో చారిత్రక ఘట్టం ఈ ఏడాది జనవరిలో ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... నూతనంగా నిర్మించిన రామ మందిరంలో నీలమేఘశ్యాముడి బాల రూపానికి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్రమంలో కోట్ల రూపాయలు కానుకలు రాముల వారికి సమర్పించుకున్నారు భక్తులు.

ఇందులో భాగంగా వస్తు రూపేణా, ధన రూపేణా ఎవరి స్థాయిలో వళ్లు, ఎవరి ప్రేరేపణ మేరకు వారు రాముల వారికి కానుకలు సమర్పించుకున్నారు. ఈ సమయంలో తాజాగా అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు ఇటీవల రూ.2,100 కోట్ల చెక్కు అందింది. దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అయితే తాజాగా ఇందులో బిగ్ ట్విస్ట్ నెలకొందని అంటున్నారు.

అవును... ఇటీవల అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందిన 2,100 కోట్ల రూపాయల చెక్కు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఈ చెక్కును పంపిన దాత దానిపై తన పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ రాశారు. అయితే ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ చెక్కును ప్రధానమంత్రి సహాయనిధి పేరు మీద ట్రస్టుకు పోస్ట్ ద్వారా పంపారు.

శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. రెండు రోజుల క్రితమే ఈ చెక్కు తమ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. ఇదే క్రమంలో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు ప్రధానమంత్రి కార్యాలయానికి పంపాల్సిందిగా ట్రస్ట్ అధికారులకు సూచించామని చంపత్ రాయ్ అన్నారు.

ఇదే సమయంలో... శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు పేరిట బ్యాంక్ ఖాతాలో రూ.2,600 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నట్లు చంపత్ రాయ్ తెలిపారు. రామ మందరితం మొదటి అంతస్తులో శ్రీరామ దర్భార్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

మరోవైపు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాల వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఇందులో భాగంగా గత ఏడాది ఆలయ నిర్మాణం కోసం రూ.776 కోట్లు ఖర్చుచేసినట్లు తెలిపింది. ఇందులో రూ.540 కోట్లు ఆలయం కోసం, రూ.136 కోట్లు ఇతరాలకు ఖర్చయినట్లు వివరించింది. మొత్తం మీద ఇప్పటివరకూ ఆలయ నిర్మాణం కోసం రూ.1,850 కోట్లు ఖర్చయ్యిందని వెల్లడించింది.