లడ్డూలో వాడని కల్తీ నెయ్యి...అయినా రాజకీయ దుమారం ?
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఎన్డీయే పక్ష సమావేశంలో మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు నుంచి తీసిన తైలాన్ని వాడారు అని తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు.
By: Tupaki Desk | 22 Sep 2024 5:15 AM GMTముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఎన్డీయే పక్ష సమావేశంలో మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు నుంచి తీసిన తైలాన్ని వాడారు అని తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు.కానీ టీటీడీ అయితే ఆ కల్తీ నెయ్యి వాడలేదని అంటోంది. దీని మీద ఒక వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కల్తీ నెయ్యి అన్నది జూలైలో వచ్చింది కానీ దానిని ఎప్పుడూ ఉపయోగించలేదని చెప్పుకొచ్చింది. అంతే కాదు వాటిని వెనక్కి తిప్పి పంపించామని కూడా పేర్కొంది.
మరి వాడని నెయ్యి మీద ఇంతటి రాజకీయ దుమారం ఎందుకు మొదలైంది, అంతే కాదు కోట్లాది మంది వెంకన్న భక్తులలో ఎందుకు అలజడి రేగేలా వారి మనోభావాలతో ఆడుకున్నారు అన్నదే కీలకమైన ప్రశ్నగా ఉంది.
జగన్ ప్రభుత్వంలో తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వుని వాడుతున్నారు అన్నవి ఆరోపణలేనా ఆధారాలు ఉన్నాయా అన్నది ఇపుడు చర్చనీయాంశం అవుతోంది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన అతి పెద్ద దుమారాన్నే రాజేసింది.
ఇది అత్యంత సున్నితమైన అంశం. దీని విషయంలో ఇపుడు ఏపీ మాత్రమే కాదు దేశంలో కూడా బిగ్ డిబేట్ సాగుతోంది. ఈ క్రమంలో ఒక వెబ్ సైట్ కి టీటీడీ ఈవో శ్యామలరావు ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్తీ నెయ్యి అన్నది అసలు వాడలేదని లడ్డూల తయారీలో దానిని ఉపయోగించలేదని స్పష్టం చేశారు.
ఆయన దీని మీద మాట్లాడుతూ జూలై 6న అలాగే 12న నాలుగు నెయ్యి ట్యాంకర్లు అన్నవి టీటీడీకి వచ్చాయని అయితే వాటిలో నెయ్యిని పరిశీలనకి ల్యాబ్ కి పంపించగా అందులో కల్తీ ఉందని వ్యక్తం కావడంతో తిప్పి పంపించడం జరిగిందని చెప్పారు.
ఇక ఆ నెయ్యిని ఎపుడూ ఉపయోగించలేదని ఇది నూరు శాతం నిజం అని చెప్పారు. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ సెంటర్ ఇచ్చిన నివేదిక మేరకు చూస్తే కనుక రెండు నెలల క్రితం తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన 10 ట్యాంకర్లలో నాలుగు ట్యాంకర్లలోని ఆవు నెయ్యి కల్తీగా ఉంది అన్నది గుర్తించి పక్కన పెట్టేశామని ఆ తరువాత వాటిని తిరిగి ఏఆర్ డైరీకి పంపించామని పక్కా క్లారిటీతో చెప్పారు. ఇక చూస్తే టీటీడీ చరిత్రలో తొలిసారిగా శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం బయటి ల్యాబ్‌లకు పంపినట్లుగా కూడా తెలిపారు. అయితే టీటీడీ వెనక్కి పంపేసిన కల్తీ నెయ్యి ట్యాంకర్ల గురించి ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు.
అయితే విషయం తెలియని భక్తులు అంతా కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలను తిని తాము ఇబ్బందిపడ్డామని బాధపడుతున్నారు. అంతే కాదు స్వామి వారికి కూడా వాటినే నైవేద్యం పెట్టారని కూడా వారు కలవరపడుతున్నారు
మరో వైపు చూస్తే ఇలా ట్యాంకర్ల నుంచి డెయిరీలు నేయిని పంపించినపడు టీటీడీ వాటిని మూడు సార్లు వివిధ దశలలో చెక్ చేసుకుంటుంది, అలా కల్తీ అని తేలితే ట్యాంకర్లను వెనక్కి పంపుతుంది. ఇది అంతకు ముందు చంద్రబాబు హయాంలో అలాగే వైసీపీ హయాంలో కూడా జరిగిందని అంటున్నారు.
ఎవరూ కూడా కల్తీ నెయ్యిని స్వామి ప్రసాదానికి కానీ నివేదినకు కానీ వాడరని అంటున్నారు. ఇక్కడ విషయం ఎంటి అంటే కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారు అని ఆధారాలు అయితే లేవు. కానీ లడ్డూలను తయారు చేశారు అన్న ఆరోపణలు మాత్రం బయటకు వచ్చాయని అంటున్నారు.
దీని మీద మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీజేపీ సీనియర్ నాయకుడు ఐవైఆర్ క్రిష్ణారావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఎన్‌డిడిబి నివేదిక తరువాత తిరస్కరించబడిన నెయ్యి గురించి అయి ఉంటే మాత్రం అవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు అని అన్నారు. తిరుపతి లడ్డూలలో జంతువుల కొవ్వు ఉందని ఆయన చేసిన ఆరోపణలకు ఏ రకమైన ఆధారాలు లేవని భావించవచ్చు అని అంటున్నారు.
నిజంగా లడ్డూలలో కల్తీ నెయ్యి వాడకం జరిగిందా అన్న దాని మీద బలమైన ఆధారాలు ఉండాలని అలా కాకపోతే మాత్రం టీడీపీ కి ఈ ఆరోపణలే బూమరాంగ్ అవుతాయని ఐవైఆర్ క్రిష్ణారావు అంటున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీసేందుకు ఎవరో జంతువుల కొవ్వును నెయ్యిలో కలిపారని చంద్రబాబు చేసిన ఆరోపణలు ఇప్పటికి అయితే నమ్మడం కష్టంగా ఉందని ఆయన అన్నారు. దాని మీద ఏదైనా .రుజువు ఉందా అని గతంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేసిఅ అనుభవం ఉన్న క్రిష్ణా రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇలాంటివి చాలా సున్నితమైన సమస్యలు వాటిని చాలా సున్నితంగా నిర్వహించాలి అంతే కానీ కానీ రాజకీయంగా ఉపయోగించుకోకూడదని ఆయన అన్నారు. మొత్తం మీద చూస్తే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. టీటీడీ ఒకలా చెబుతూంటే బాబు మరోలా చెబుతున్నారని కూడా అంటున్నారు. మరి పూర్తి దర్యాప్తు జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని అంటున్నారు.