Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో అల్లం లేకుండా అల్లం పేస్ట్ తయారీ.. ఆన్ లైన్ లోనూ అమ్మకం!

ఈ క్రమంలో సిటీలో మరో కల్తీ విషయం బయట పడింది. ఇక్కడ అల్లం లేకుండా అల్లం పేస్టు తయారు చేసేస్తున్నారు!

By:  Tupaki Desk   |   18 Nov 2024 5:30 AM GMT
హైదరాబాద్ లో అల్లం లేకుండా అల్లం పేస్ట్  తయారీ..  ఆన్  లైన్  లోనూ అమ్మకం!
X

అత్యంత ఘోరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కల్తీ అనే విషయంలో పీక్స్ కి చేరిపోతున్నాయి పరిస్థితులు! జంతువుల వ్యర్థ పదార్థాలతో వంటనూనె, నెయ్యి తయారు చేస్తున్న విషయం ఇటీవల హైదరాబాద్ నగర శివార్లలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిటీలో మరో కల్తీ విషయం బయట పడింది. ఇక్కడ అల్లం లేకుండా అల్లం పేస్టు తయారు చేసేస్తున్నారు!

అవును... అల్లం అవసరం లేకుండానే అల్లం పేస్టు తయారు చేసేసి.. హైదరాబాద్ నగరంలోని పెద్ద పెద్ద హోటల్స్ కు సరఫరా చేస్తూ, ఆన్ లైన్ లోనూ అమ్మకాలు ప్రారంభించేసింది ఓ బ్యాచ్! తాజాగా టాస్క్ ఫోర్స్ టీం ఈ తయారీ కేంద్రంపై దాడులు చేయడంతో.. అల్లం లేకుండా యాసిడ్ సహాయంతో అల్లం పేస్టు తయారు చేస్తున్న షాకింగ్ విషయం బయట పడింది!

వివరాళ్లోకి వెళ్తే... సికింద్రాబాద్ లోని ఓల్డ్ బోయినపల్లిలో గల "సోనీ జింజర్ గార్లిక్ పేస్ట్" అనే అల్లం పేస్ట్ తయరీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ బృందం దాడులు జరిపింది. ఈ దాడుల్లో సుమారు 1,500 కిలోల కల్తీ అల్లంపేస్టు దొరికింది. దీన్ని స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు.. 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ సమయంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

స్థానిక రాజరాజేశ్వరి నగర్ లో మహ్మద్ షఖీల్ అహ్మద్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఈ వ్యాపారంలో.. అల్లంకు బదులు ప్రమాదకరమైన సిట్రిక్ యాసిడ్, పసుపు, ఉప్పు ఉపయోగించి.. అల్లం లేకుండానే అల్లం పేస్టు తయారు చేస్తున్నారంట. ఈ పేస్టును అందంగా ప్యాక్ చేసి.. సిటీతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోని ప్రముఖ హోటళ్లకు సరఫరా చేస్తున్నారు.

ఇదే సమయంలో... ఆన్ లైన్ లోనూ విక్రయిస్తున్నారని అంటున్నారు. సుమారు మూడేళ్లుగా ఈ కల్తీ దందా కొనసాగుతోందని అంటున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు! ఈ సందర్భంగా... 1500 కిలోల కల్తీ అల్లం పేస్టు, 55 కిలోల సిట్రిక్ యాసిడ్, 480 కిలోల నాసిరకం వెల్లుల్లితో పాటు అక్కడ పనిచేస్తున్న 8 మందిని అరెస్ట్ చేశారు!