బాబుకు జనం మద్దతు లేదు...కమ్మలను ఒంటరి చేశారు...!
ఏపీలో టీడీపీ పని అయిపోయిందని మాజీ ఎమ్మెల్యే అడుసుమల్లి జయప్రకాష్ అంటున్నారు. బలమైన ఒక సామాజిక వర్గాన్ని ఒంటరిని చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని ఆయన అన్నారు.
By: Tupaki Desk | 24 Sep 2023 2:30 AM GMTఏపీలో టీడీపీ పని అయిపోయిందని మాజీ ఎమ్మెల్యే అడుసుమల్లి జయప్రకాష్ అంటున్నారు. బలమైన ఒక సామాజిక వర్గాన్ని ఒంటరిని చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడుకు బడుగు బలహీన వర్గాలతో సహా సామాన్య జనం మద్దతు లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాబు జీవితం మొత్తం నేరమయం అన్నారు. ఆయన రెండెకరాల నుంచి ఇన్ని కోట్లకు అధిపతి ఎలా అయ్యారని ప్రశ్నించారు. అవినీతి మీద ఆధారాలు ఉంటే బాబుని అరెస్ట్ చేసి జైలులో పెట్టకపోతే ఎక్కడ పెడతారు అని ఆయన నిలదీశారు. బాబు అరెస్ట్ కి నిరసన అంటూ జరుగుతున్నది పూర్తిగా పెయిడ్ ఉద్యమం అని ఆయన ఘాటైన వ్యాఖ్యలే చేశారు.
బాబుకు నిజంగా ప్రజాదరణ ఉంటే విజయవాడలో ఉద్యమం లేచి రావాలని అలాంటి పరిస్థితి ఉందా అని ఆయన ప్రశ్నించారు. అడుసుమల్లి జయప్రకాష్ 1983లో అన్న గారి పిలుపు అందుకుని రాజకీయ రంగ ప్రవేశం చేసి తొలిసారి 1983లో విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఆయన టీడీపీలో సీనియర్ లీడర్ గా కొనసాగారు.
ఉమ్మడి ఏపీ విభజన తరువాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకున్నా సామాజిక రాజకీయ అంశాల మీద ఎప్పటికపుడు స్పందిస్తారు. తాజాగా ఆయన చంద్రబాబు అరెస్ట్ మీద వివిధ సామాజిక మాధ్యమాలలో చానళ్లలో ఇంటర్వూలు ఇస్తూ కీలక కామెంట్స్ చేసారు. చంద్రబాబు పాపం పండింది కాబట్టే ఈ అరెస్ట్ అని అన్నారు. పక్కా ఆధారాలతోనే స్కిల్ స్కాం లో బాబు అరెస్ట్ జరిగింది అన్నారు పదమూడు చోట్ల బాబు సంతకాలు ఉన్నాయని అన్నారు.
నిజానికి ఈ కేసులో మొదట ఈడీ, జీఎస్టీ విభాగాలు విచారణ చేశాయని, ఆ మీదటనే ఏపీ సీఐడీ టేకప్ చేసిందని గుర్తు చేశారు. చంద్రబాబు రెండెకరాల ఆసామి నుంచి తన రాజకీయ జీవితం మొదలెట్టారని, 1978లో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాగానే తిరుపతిలో విష్ణు ప్రియ పేరుతో ఫైవ్ స్టార్ హొటల్ ఎలా కట్టగలిగారని ప్రశ్నించారు.
ఎన్టీయార్ అల్లుడిగా బాబు చాలానే కూడగట్టుకున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీని నిర్జీవం చేసింది చంద్రబాబే అన్నారు. కమ్మ వారిని సమాజంలో ఒంటరిగా చేయడంతో టీడీపీ అతి ఉత్సాహం ప్రధాన కారణం అవుతోంది అన్నారు. అమెరికాలో, లండన్ లో బాబు అరెస్ట్ కి నిరసంగా ఆందోళన అంటూ వస్తున్నవి పూర్తిగా పెయిడ్ ఉద్యమాలు అన్నారు.
టీడీపీకి నాయకత్వ బలం లేదని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత లోకేష్ బాలయ్యలు టీడీపీకి ఏమీ కారని, ఏమీ చేయలేరని చెప్పారు. ఢిల్లీలో పది రోజులుగా ఉన్నా కూడా నారా లోకేష్ ని ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు.
ఇదిలా ఉండగా ఏ అధారాలు లేకుండా కేవలం ఆరోపణల మీద వైఎస్ జగన్ మీద 2011లో కేసు పెట్టి సీబీఐ ద్వారా అరెస్ట్ చేయించారని ఆయన గుర్తు చేశారు ఇపుడు పక్కా ఆధారాలతో బాబు దొరికితే అక్రమం అనడమేంటని అన్నారు. చంద్రబాబు పాపం పండిందని, ఇంకా చాలా పెద్ద కేసులే ఉన్నాయని అవి కూడా తొందరలో న్యాయ స్థానాల ముందుకు వస్తాయని చెప్పారు.
అమరావతి రాజధాని పెద్ద స్కాం అన్నారు. ఎక్కడో ఉరవకొండలో ఉన్న పయ్యావుల కేశవ్ కి అక్కడ భూములు ఎలా వచ్చాయని అడుసుమిల్లి ప్రశ్నించారు. బాబు తరఫున వాదిస్తున్న న్యాయవాదులు, వివిధ రంగాలలో ప్రముఖులు చాలా మందికి అక్కడ భూములు ఇచ్చారని, ఇన్నర్ రోడ్ అలైన్మెంట్ లో ఎవరికీ గజం కూడా పోకుండా ఎలా చేసారని, ఇదంతా స్కాం కాదా అని అడుసుమల్లి ప్రశ్నించారు.
అలాగే ఫైబర్ నెట్ కూడా మరో పెద్ద స్కాం అని అన్నింటికీ ఆధారాలు పక్కాగా ఉన్నాయని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ మీద నిరసనలు వ్యక్తం చేసేవారు అర్ధ రహితంగా వ్యవహరిస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. న్యాయ పోరాటం ద్వారానే బయటకు రావాలని చూడాలి తప్ప ఈ విధంగా చేయడమేంటని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మరోసారి ఏపీకి సీఎం తప్పకుండా అవుతారని, బడుగు బలహీన వర్గాల ప్రజలు అంతా ఆయన వైపే ఉన్నారని అడుసుమల్లి జోస్యం చెప్పారు.
టీడీపీకి ఒక సామాజికవర్గం అండగా ఉందని చెప్పడం తప్పు అని అన్నారు. తాను కూడా అదే సామాజికవర్గానికి చెందిన వాడినని ఆయన అంటూ నిజాయతీగా ఎవరైనా మాట్లాడాలని అన్నారు. నిజానికి కమ్మ సామాజికవర్గానికి టీడీపీ వల్ల చంద్రబాబు వల్ల తీరని నష్టం జరిగిందని ఆయనంత స్వార్ధపరుడు ఎవరూ లేరని అన్నారు. సోషల్ మీడియాలో అడుసుమల్లి చేసిన వ్యాఖ్యలు ఈ కీలక సమయంలో తెగ వైరల్ అవుతున్నాయి.