మందేస్తే రూ.20 వేలు.. అమ్మితే రూ.లక్ష!
మద్యం మహమ్మారి తమ జీవితాలను నాశనం చేస్తుందని కలత చెందిన గ్రామ మహిళలంతా ఒక్కమాటపై నిలిచి మద్యం అమ్మకాలపై కదం తొక్కారు.
By: Tupaki Desk | 13 Feb 2025 6:30 PM GMTమద్యపానం, మద్యం విక్రయాలపై ఓ గ్రామంలో మహిళలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దావత్ పేరిట జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, కుటుంబ సభ్యులు అనాథలు అవుతున్నారనే ఆవేదనతో గ్రామంలో మద్యం మాటే వినిపించకూడదని మహిళలు అంతా ఏకమై తీర్మానించుకున్నారు. దీంతో నల్గొండ జిల్లా ఏపూరు గ్రామంలో మద్యం తాగినా, అమ్మినా భారీ జరిమానాలు చెల్లించాల్సివుంటుందని దండోరా వేయించారు.
మద్యం విక్రయం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వాలు చూస్తుంటాయి. మద్యపానం హానికరమంటూ చెబుతూనే విక్రయాలకు డోర్లు బార్లా తెరుస్తుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే మద్యం అమ్మకపోతే ప్రభుత్వాలు నడవలేని పరిస్థితి ఉందని చెబుతారు. ప్రభుత్వం రథ చక్రాలు నడవాలంటే మద్యమే ఇంధనం అనే అభిప్రాయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపూరు గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యం మహమ్మారి తమ జీవితాలను నాశనం చేస్తుందని కలత చెందిన గ్రామ మహిళలంతా ఒక్కమాటపై నిలిచి మద్యం అమ్మకాలపై కదం తొక్కారు.
మద్యపాన నిషేధానికై నడుం బిగించిన నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్ గ్రామ మహిళలు మద్యపానం నిషేధించాలని కోరుతూ గ్రామంలో పాటలు పాడుతూ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో బెల్ట్ షాపుల వల్ల యువత మద్యానికి బానిసలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించడం ద్వారా చాలా మరణాలు సంభవించాయని చెబుతూ మద్యం తాగితే రూ.20 వేలు జరిమానా వసూలు చేస్తామని తాగుబోతులకు హెచ్చరించారు. అదేవిధంగా గ్రామంలో మద్యం అమ్మితే లక్ష రూపాయల జరిమానా విధిస్తామని బెల్టు షాపుల నిర్వాహకులను హెచ్చరించారు. అదేవిధంగా నిషేధిత గుట్కా సిగరెట్ల అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు తెలిపారు.
ఇటీవల ఏపూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్లే ఆ ప్రమాదం జరిగిందని మహిళలు తెలుసుకున్నారు. బెల్టు దుకాణాల వల్ల అమాయకులైన యువకులు అర్ధాంతరంగా జీవితాలు పాడు చేసుకుంటున్నారని బాధపడిన మహిళలు ఏకతాటిపైకి వచ్చారు. మద్యం విక్రయాలు, సేవనంపై గ్రామంలో నిషేధం విధించారు. ఇదే సందర్భంలో తాగుబోతులకు, మద్యం విక్రేతలకు జరిమానా విధిస్తామని చెప్పిన మహిళలు.. ఆ రెండు చేసిన వారిని పట్టిస్తే రూ.10 వేల నగదు బహుమతిని ప్రకటించారు. ఏపూరు గ్రామస్తులు తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. చుట్టుపక్కల గ్రామాల మహిళలను ఆలోచనకు గురిచేస్తోందని చెబుతున్నారు.