Begin typing your search above and press return to search.

ఆఫ్ఘనిస్తాన్ సంచలన నిర్ణయం... భారత్ తో కటీఫ్?

ఆఫ్ఘనిస్తాన్‌ ను పాలిస్తున్న తాలిబన్ల ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. భారత దేశ రాజధాని ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసి వేసింది.

By:  Tupaki Desk   |   24 Nov 2023 7:44 AM GMT
ఆఫ్ఘనిస్తాన్  సంచలన నిర్ణయం... భారత్  తో కటీఫ్?
X

ఆఫ్ఘనిస్తాన్‌ ను పాలిస్తున్న తాలిబన్ల ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. భారత దేశ రాజధాని ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసి వేసింది. ఇదే సమయంలో ఇతర నగరాల్లో ఉన్న హైకమిషనర్, కాన్సులేట్ కార్యాలయాను కూడా శాశ్వతంగా మూసివేస్తోన్నట్లు ప్రకటించింది. దీంతో... భారత్‌ తో దౌత్యపరమైన సంబంధాలను తెగదెంపులు చేసుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

అవును... భారత్‌ లో తమ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు అఫ్గానిస్థాన్‌ ఎంబసీ ప్రకటించింది. దీంతో 2023 నవంబర్‌ 23 నుంచి దేశంలో తమ దౌత్య కార్యకలాపాలు నిలిచిపోయినట్లు తెలిపింది. అయితే... సెప్టెంబర్‌ 30 నుంచే భారత్‌ లో అఫ్గాన్‌ ఎంబసీ కార్యకలాపాలు నిలిచిపోయాయి కానీ, భారత ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందకపోవడంతో ఈసారి శాశ్వత మూసివేయబడుతున్నాయ్యని ఎంబసీ ప్రకటించింది.

ఈ సందర్భంగా స్పందించిన ఎంబసీ... భారత్‌ లోని అఫ్గాన్‌ పౌరులకు కృతజ్ఞతలు తెలిపింది. కాబుల్‌ లో చట్టబద్ధమైన ప్రభుత్వం లేకపోయినా.. పరిమిత వనరులు, అధికారాలతోనే సంక్షేమానికి కృషి చేశామని వివరించింది. ఈ సమయంలో తమను అర్థం చేసుకొని ఎంతో సహకరించారని పేర్కొంది. అదేవిధంగా... గత రెండేళ్ల నుంచి భారత్‌ లో అఫ్గాన్‌ వాసుల సంఖ్య తగ్గిపోయిందని వెల్లడించింది.

ఇదే సమయంలో... భారత్‌ లో గత అఫ్గాన్‌ రిపబ్లిక్‌ కు సంబంధించిన దౌత్య అధికారులు ప్రస్తుతం ఎవరూ లేరని ఎంబసీ తన ప్రకటనలో పేర్కొంది. వారంతా ఇతర దేశాలకు సురక్షితంగా చేరారని తెలిపింది. ప్రస్తుతం భారత్‌ లో ఉన్న వ్యక్తులు తాలిబన్ ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తున్నవారని పేర్కొంది. తాలిబన్‌ దౌత్య అధికారులకు అనుమతి ఇవ్వడమా లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడమా అనే అంశాన్ని భారత ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నామని పేర్కొంది.

వాస్తవానికి ఇప్పుడు భారత్ లో ఉన్నది గత ఆఫ్ఘాన్ ప్రభుత్వ ఎంబసీ. అయితే ఇప్పుడు ఆఫ్ఘాన్ లో ఉన్నది తాలిబన్ల ప్రభుత్వం. ఈ తాలిబాన్ల ప్రభుత్వాన్ని భారత్‌ ఇంకా గుర్తించలేదు. అందువల్లే... ఆ దేశ రాయబార కార్యాలయానికి సంబంధించి భారత్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు. దీంతో తమ పట్ల భారత్‌ నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఆఫ్ఘన్ ఎంబసీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా... 2021 ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్న సంగతి తెల్సిందే. నాటి నుంచీ ఆఫ్ఘాన్ ప్రజల పరిస్థితి ప్రత్యక్ష నరకంగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నాటి నుంచి పక్కనున్న పాక్ కు లక్షల సంఖ్యలో వలసలు జరిగాయని చెబుతున్నారు! ఇదే సమయంలో తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు!