తాలిబాన్ల అరాచకం... ఫుట్ బాల్ స్టేడియంలో బహిరంగంగా...!
తాలిబాన్ల పాలనలో ఆఫ్ఘాన్ ప్రజలు పడుతోన్న ఇబ్బందుల సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 15 Aug 2023 3:54 AM GMTతాలిబాన్ల పాలనలో ఆఫ్ఘాన్ ప్రజలు పడుతోన్న ఇబ్బందుల సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో తాలిబాన్ల రూపంలో అరాచకం రాజ్యమేలుతుందని చెబుతుంటారు. నియంతృత్వానికి ఇది మరోకోణం అని చెబుతుంటారు. ప్రత్యక్ష నరకం భూగ్రహంపైనే చూస్తున్నట్లు చెబుతుంటారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి.
ఈ సమయంలో మరో దారుణం తెరపైకి వచ్చింది. గతంలో జరిగిన ఒక విషయం కొతమంది ధైర్యం వల్ల వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... ఫుట్ బాల్ స్టేడియంలో వేలమందిని వీక్షకులుగా ఆహ్వానించి, బహిరంగ శిక్షలు అమలు చేసిన సంఘటన ఒళ్లు గగ్గురుపొడిచే విషయాలను ప్రపంచంముందుకు తెచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే... 2022 డిసెంబరు 22న సెంట్రల్ అఫ్గాన్ లోని తరిన్ కోట్ పట్టణంలో ఒక ఫుట్ బాల్ స్టేడియంలో 22 మందిని అందరూ చూస్తుండగానే తాలిబాన్ అధికారులు శిక్షను అమలు చేశారు. ఆ 22 మందిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వీరిని కొరడాలతో కొట్టారు!
అయితే దీనికి ఒకరోజు ముందే వీరికి శిక్షలు అమలు చేయబోతున్నట్లు మసీదుల్లో, రేడియోలో ప్రకటించారు. కొరడాతో కొట్టడాన్ని చూసేందుకు అందరూ రావాలని.. దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలని ప్రజలకు వారు సూచించారు. సుమారు 18,000 మంది కుర్చోడానికి వీలుండే ఈ స్టేడియం ఆల్ మోస్ట్ ఫుల్ అయిపోయిందని అంటున్నారు!
ఎండ చాలా ఎక్కువగా ఉన్న ఆ సమయంలో.. స్టేడియం మధ్యలో గడ్డిలో వారిని కూర్చోబెట్టి కొరడాతో కొట్టినట్లు తాలిబాన్ ల సుప్రీం కోర్టు ట్విటర్ వేదికగా స్పష్టంచేసింది. ఇదే సమయంలో షరియాను అనుసరించి శిక్షలను అమలు చేస్తున్నట్లు తాలిబాన్ల అధికార ప్రతినిధి చెబుతున్నారు!
ఈ నిందితుల్లో 18 నుంచి 37 ఏళ్ల మధ్య వయసున్న మగవారికి 25 నుంచి 39 కొరడా దెబ్బలు కొట్టినట్లు తెలుస్తోంది. ఇలా విచక్షణా రహితంగా దెబ్బలు కొడుతున్న సమయంలో కొంతమంది చాలా గట్టిగా అరవగా.. మరికొంతమంది బిగ్గరా ఏడ్వగా.. ఇంకొంతమంది దెబ్బలను మౌనంగా తట్టుకున్నారట!
అదికూడా మొదటి 20 కొరడా దెబ్బల వరకేనట. సుమారు 20 దెబ్బలు తిన్న అనంతరం శరీరం మొద్దుబారిపోవడం జరిగిందట. ఫలితంగా తర్వాత ఏమి జరిగిందో తెలియదని బాధితులు చెప్పినట్లు సమాచారం. ఈ ఘోరాన్ని చూడలేక ఆ స్టేడియంలో ఉన్నవారెవరైనా... మధ్యలో వెళ్లిపోయే ఛాన్స్ కూడా లేకుండా చేశారంట తాలిబన్లు!
కాగా... 2022 నవంబరు నుంచి తాలిబాన్ ప్రభుత్వం ఇలాంటి శిక్షలను బహిరంగంగా అమలుచేస్తోంది. మరోవైపు అప్పటి నుంచే సుప్రీంకోర్టు కూడా దీనిపై ప్రకటనలు విడుదల చేయడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఇలాంటి శిక్షలను 50 సార్లకుపైనే అమలుచేయగా... మొత్తంగా 346 మందికి శిక్షలు విధించారు.