Begin typing your search above and press return to search.

కూటమి వైపుగా టీడీపీ మాజీలు ?

ఈ క్రమంలో టీడీపీ మాజీలు తిరిగి అధికార పార్టీ వైపు చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   15 July 2024 2:26 AM GMT
కూటమి వైపుగా టీడీపీ మాజీలు ?
X

వైసీపీ అయిదేళ్ల క్రితం అధికారంలోకి రావడంతో టీడీపీని వీడి చాలా మంది ఆ పార్టీలో చేరారు. అలా చేరిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే నాడు ఫ్యాన్ నీడకు చేరారు. ఇపుడు చూస్తే వైసీపీ పరిస్థితి ఏ మాత్రం బాగు లేదు. ఓటమి కూడా మామూలుగా లేదు. దారుణమైన పరాజయం పలకరించింది. దాంతో టీడీపీ కూటమితో ఉత్తరాంధ్ర మొత్తం నిండిపోయింది. ఈ క్రమంలో టీడీపీ మాజీలు తిరిగి అధికార పార్టీ వైపు చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

గతంలో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వైసీపీ వైపు వచ్చినా అయిదేళ్లలో వారికి ఎలాంటి న్యాయం జరగలేదని అంటున్నారు. నామినేటెడ్ పోస్టులు కూడా దక్కలేదని అంటున్నారు. వారిలో ఒక్కరికి కూడా టికెట్లు ఇవ్వలేదని అంటున్నారు.

దీంతో పూర్తిగా డీలా పడిన వారు ఎన్నికల వేళకే పెద్దగా ఫీల్డ్ లోకి రాలేదని అంటున్నారు. ఇపుడు పార్టీ ఎటూ ఓడింది కాబట్టి టీడీపీలోకి వెళ్తే మేలు అని తలపోస్తున్నారుట. తమకు అధికార పార్టీలో ఉంటే అదే రాజకీయ లాభం అని అంటున్నారు.

అలాగే ఒక తాజా ఎన్నికల్లో ఓడిన ఒక మాజీ ఎమ్మెల్యే కూడా వైసీపీలో ఇమడలేకపోతున్నారు అని అంటున్నారు. ఆయనకు విద్యా వ్యాపారాలు ఉన్నాయి. దాంతో వాటి కోసం అయినా ఆయన కూటమికి జై కొట్టాల్సిందే అని అంటున్నారు.

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు సన్నిహితుడు అయిన ఒక సీనియర్ నేత సైతం వైసీపీలో మూడేళ్ళ క్రితం చేరారు. ఆయన అనకాపల్లి ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ దక్కలేదు. దాంతో ఆయన కూడా తన దారి తాను చూసుకోవాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఇక విశాఖ డైరీ చైర్మన్ గా ఉంటూ విశాఖ పశ్చిమ నుంచి తాజా ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆడారి ఆనంద్ కుమార్ కూడా వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు ఆయన పార్టీ సమీక్షలకు కూడా హాజరు కావడం లేదు. దీంతో ఆయన సైతం టీడీపీలో చేరుతారా అన్న చర్చ సాగుతోంది. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక మున్సిపల్ చైర్ పర్సన్ సహా కౌన్సిలర్లు కూడా కూటమి వైపు చూస్తున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే వీరందరూ రావడానికి సుముఖంగా ఉన్నా అధికార కూటమి ఎంతమందిని చేర్చుకుంటుంది అన్నది కూడా చూడాలని అంటున్నారు. ఎక్కడికక్కడ పార్టీ నేతలు టీడీపీలో ఉన్నారు.దాంతో వారు వీరి రాకను వ్యతిరేకిస్తే వర్గ పోరు స్టార్ట్ అవుతుందన్నది కూడా ఆలోచిస్తున్నారుట. అయితే అంగబలం అర్ధబలంతో పాటు సామాజిక సమీకరణలకు అనువుగా ఉంటే అలాంటి వారిని పార్టీలో చేర్చుకోవడం మంచిదని టీడీపీలో ఒక చర్చ సాగుతోంది అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.