బడ్జెట్ సెషన్ తరువాత ఏపీ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు ?
ఏపీ రాజకీయాలు సాఫీగా సజావుగా సాగుతున్నాయని ఎవరూ అనుకోవడం లేదు. అధికారంలో చూస్తే మూడు పార్టీలతో కూటమి ప్రభుత్వం సాగుతోంది.
By: Tupaki Desk | 18 Feb 2025 4:00 AM GMTఏపీ రాజకీయాలు సాఫీగా సజావుగా సాగుతున్నాయని ఎవరూ అనుకోవడం లేదు. అధికారంలో చూస్తే మూడు పార్టీలతో కూటమి ప్రభుత్వం సాగుతోంది. దాంతో కూటమిలో అంతా కలిసి అడుగులు వేస్తున్నా దాని సవాళ్ళు దానికి ఉన్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి కాలు చేయీ కూడదీసుకోలేని విధంగా ఆర్ధిక కష్టాలు వెన్నంటి ఉన్నాయి.
ఇక విపక్షం వైపు నుంచి చూస్తే వైసీపీ పూర్తిగా రాజకీయ ఇబ్బందులో పడిపోయింది. ఆ పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోవడమే తప్ప చేరేవారు లేరు. ఉన్న వారిలో సైతం ఉత్సాహం అయితే లేదు. ప్రస్తుతానికి వైసీపీ నుంచి ఎమ్మెల్సీలు రాజ్యసభ ఎంపీలు ఆపరేషన్ ఆకర్ష్ మంత్రంతో బంధీలు అవుతున్నారు. దీనికి కూటమి రాజకీయ అవసరాలే ప్రధాన కారణం.
ఏపీ శాసన మండలిలో కూటమికి బలం పెరగాలీ అంటే వైసీపీ ఎమ్మెల్సీలనే వల వేసి తీసుకుని రావాల్సి ఉంటుంది. అలా ఇప్పటికి అయిదారుగురు రాజీనామా చేసారు. మరింతమంది అదే బాటన నడవనున్నారని ప్రచారం సాగుతోంది. అలాగే 11 మంది రాజ్యసభ ఎంపీలలో నలుగురు పార్టీకి దూరం అయ్యారు. ఇంకా ఆ సంఖ్య పెరుగుతుందని ఒక టాక్ అయితే జోరుగా సాగుతోంది.
ఇపుడు చూస్తే వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో కూడా కొందరు అధికార కూటమి వైపుగా వచ్చేందుకు చూస్తున్నారు అన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. నిజానికి చూస్తే కూటమి వైపు నుంచి ఎటువంటి ఆపరేషన్ ఆకర్ష్ అన్నది వీరి మీద లేదు. కూటమికే 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. దాంతో ఈ తరహా ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు కూటమి పెద్దలు కూడా ఇష్టపడడం లేదు.
కానీ వైసీపీ ఎమ్మెల్యేలే తాము అధికార పార్టీ వైపుగా వెళ్ళేందుకు ఆలోచిస్తున్నారు అన్న ప్రచారం మాత్రం రాజకీయంగా సంచలనమే రేపుతోంది. వైసీపీకి ఉన్నవారే 11 మంది. ఇందులో కొంతమంది వెళ్ళిపోతే సింగిల్ డిజిట్ కి బలం పడిపోతుంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలలో కొందరు ఈ విధంగా ఆలోచించడానికి కూటమి పెద్దల కంటే కూడా వైసీపీ అధినాయకత్వం నిర్ణయాలే కారణం అని అంటున్నారు.
ప్రజలు నమ్మి గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్షా అని పిలిచే భాగ్యం లేకుండా పోయిందని కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు వాపోతున్నారు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా గెలిచి సుఖమేంటని ఆవేదన చెందుతున్నారు. అసెంబ్లీకి వెళ్ళకపోతే ఈ పదవులు ఎందుకు అన్న చర్చ కూడా ఉంది. మేము అసెంబ్లీకి రాము మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని జగన్ అయితే మీడియా ముఖంగానే చెబుతున్నారు అయితే ఇది బహిష్కరణ కాదని తమను ప్రతిపక్షంగా గుర్తించకపోవడం వల్లనే ఇదంతా చేస్తున్నామని ఆయన చెబుతున్నారు.
ఈ లాజిక్ అయితే సొంత పార్టీ ఎమ్మెల్యేలకే అర్ధం కావడం లేదు అని అంటున్నారు. 18 మంది ఎమ్మెల్యేలు లేకపోతే విపక్ష హోదా దక్కదు. అది తెలిసి వైసీపీ అధినాయకత్వం ఈ విధంగా డిమాండ్ చేయడం సహేతుకం కాదెమో అన్నది కొందరి భావనగా ఉంది అని అంటున్నారు దాంతో పాటు 60 రోజుల వ్యవధిలో ఒకసారి అయినా సభకు హాజరు కాకపోతే ఆటోమెటిక్ గా సభ్యత్వం రద్దు అవుతుందని స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చెబుతున్న మాటలు అందుకు చూపిస్తున్న రూల్స్ కూడా వైసీపీ ఎమ్మెల్యేలలో చర్చకు తావిస్తున్నాయని అంటున్నారు.
దాంతో తమ సభ్యత్వాలు పోతే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి గెలవడం అన్నది వారికి భయపడేలా చేస్తోంది అని అంటున్నారు. దీంతోనే కొందరు అటు నుంచి ఇటు రావాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఈ బడ్జెట్ సెషన్ తర్వాత ఈ విషయంలో కొందరు ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే కనుక రాజ్యసభ ఎంపీలలో కచ్చితంగా ఇద్దరు బీజేపీ గూటికి చేరుతారు అని అంటున్నారు. అది కూడా ఏప్రిల్ తో ముగిసే కేంద్ర బడ్జెట్ సమావేశాల తరువాతనే జరుగుతుందని అంటున్నారు. బీజేపీకి రాజ్యసభలో బలం కావాలి. దాంతో వైసీపీ మీద గురి పెట్టిందని అంటున్నారు. ఇలా చూసుకుంటే కనుక వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎంపీల విషయంలో భారీ రాజకీయ సంచలనాలు అన్నీ బడ్జెట్ సెషన్ తర్వాత చోటు చేసుకుంటాయని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంత అన్నది ముందు ముందు తెలియనుంది.