ఏపీ ఎన్నికల తరువాత ఒక పార్టీ కనుమరుగు ?
ఆ విధంగా జరుగుతుందా అంటే జరుగుతున్న పరిణామాలు విశ్లేషిస్తున్న వారు అలాగే జరుగుతుంది అని అంటున్నారు.
By: Tupaki Desk | 26 April 2024 8:30 AM GMTఏపీలో ఈసారి పోటా పోటీగా ఎన్నికలు జరుగుతున్నాయి. జీవన్మరణ సమస్యగా ఈ ఎన్నికలను అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం పార్టీ భావిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రెండు పార్టీలు గురి పెడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో గెలిచిన పార్టీదే అధికారంతో పాటు రాజకీయ జీవం కూడా అని అంటున్నారు. ఓడిన పార్టీకి మరో ముప్పు ముంచి ఉంది అని అంటున్నారు. అదేంటి అంటే ఆ పార్టీ రాజకీయ తెర మీద నుంచి కనుమరుగు కావడం అని అంటున్నారు.
ఆ విధంగా జరుగుతుందా అంటే జరుగుతున్న పరిణామాలు విశ్లేషిస్తున్న వారు అలాగే జరుగుతుంది అని అంటున్నారు. కచ్చితంగా 2024 ఎన్నికల తరువాత ఒక పార్టీ అంతర్ధానం కావడం తధ్యమని అంటున్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఏపీలో టీడీపీ కూటమి అధికారం చేపడితే వైసీపీ ఎమ్మెల్యేలు అంతా బీజేపీలో చేరిపోయేందుకు క్యూ కడతారు అని అంటున్నారు.
అలా కాకుండా కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏపీలో టీడీపీ కూటమి వస్తే అపుడు వైసీపీ ఎమ్మెల్యేలు అంతా షర్మిల నాయకత్వంలోని ఏపీ కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు క్యూ కడతారు అని అంటున్నారు. ఇక ఏపీలో టీడీపీ కూటమి ఓటమి పాలు అయితే కేంద్రంలో ఎవరు అధికారంలోకి ఆ పార్టీలలోకి టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లిపోతారు అని కూడా ప్రచారం సాగుతోంది. ఇదంతా ఎందుకు అంటే ఓడిన పార్టీ తరఫున అయిదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చునే ఓపిక అయితే ఎవరికీ లేదు అని అంటున్నారు. అందరికీ అధికారం కావాలనే ఉందని అంటున్నారు. దాని కోసం పాకులాడే క్రమంలో విపక్షంలోకి వచ్చిన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అధికారం వైపు క్యూ కడతారు అని అంటున్నారు.
ఓడినా జనంలోనే ఉంటూ పోరాడే తత్వం రాజకీయ నాయకులకు లేదు, రాలేదు అని అంటున్నారు. నిజానికి చూస్తే ఆ విధంగా ఎమ్మెల్యేలు అధికారం వైపు మళ్ళడానికి ఎన్నికల వ్యయం కూడా ముఖ్య కారణం. దేశంలో అన్ని చోట్లా ఈ రకమైన పరిస్థితి లేదు. పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటకలో విపక్షంలో ఉన్న పార్టీలలో ఎమ్మెల్యేలు అధికార పక్షం మీద పోరాటం చేస్తూనే ఉన్నాయి.
వారు ఇంకా సిద్ధాంతాలతో కొనసాగుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ శాతం ఫిరాయింపులు ఎందుకు అంటే శక్తిని మించి ఎన్నికల ఖర్చులు పెట్టడం. కోట్లాది రూపాయలను ఎన్నికలలో గెలుపు కోసం వెచ్చించడం చేస్తున్నారు. అంత డబ్బు రాజకీయ జూదం కోసం వెచ్చించాక అక్కడ రివర్స్ అయితే మొత్తానికి మొత్తం సాధారణ జీవితమే లేకుండా పోతోంది.
దానికి తోడు మిగిలిన రాష్ట్రాలలో కన్నా తెలుగు రాష్ట్రాలలో ప్రతీకార రాజకీయాలు పెరిగిపోయాయి. ఓటమి పాలు అయిన వారి మీద వివిధ రకాలుగా వేధింపులు చేస్తున్నారు. అదే విధంగా ఒత్తిళ్ళు పెడుతున్నారు. దానికి తోడు రెండు జాతీయ పార్టీల వైఖరి కూడా ఈ విధంగానే ఉండడం విశేషం. గతంలో కాంగ్రెస్ ఫిరాయింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేది. అన్న గారు సీఎం అయితే ఏడాదిన్నరలో కూల్చేసే కుట్ర నాడు ఢిల్లీ వేదికగా సాగింది.
తేడా పార్టీ అని చెప్పుకునే బీజేపీ అదే పని చేస్తోంది. అందువల్ల చూసినట్లు అయితే భవిష్యత్తు మీద బెంగటిల్లుతూ చాలా మంది అధికార పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. ముందు తమకు ఉనికి ఉంటే ఆ తరువాత మిగిలినది అన్న ఆలోచనలో ఉన్న వారు విపక్షంలో వారు అవుతున్నారు. ఇక అధికారంలోకి వచ్చిన వారి తీరు ఎలా ఉంది అంటే విపక్షాన్ని మొత్తం ఊడ్చి పారేయాలన్న కసి మీదనే పనిచేస్తున్నారు. వారూ వీరు అని కాదు అందరూ అదే బాటలో నడుస్తున్నారు.దాంతో ఎక్కడో కరడు కట్టిన వారు తప్ప మొత్తానికి మొత్తం పార్టీల నుంచి ఓడిపోయిన తరువాత అధికార పక్షం వైపు వెళ్లిపోతున్నారు. దాంతో విపక్ష పాత్ర అన్నది ప్రశ్నార్థకం అవుతోంది. ఇది మంచి పరిణామం కాకపోయినా జరుగుతున్నది మాత్రం ఇదే.