Begin typing your search above and press return to search.

అప్జల్ గంజ్ లో కాల్పులు జరిపిన పారిపోయనోళ్లు ఎక్కడ?

ఇప్పటివరకు చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. దుండగులు ట్రైన్ లో పారిపోయి ఉంటారా? లేదంటే రోడ్డు మార్గంలో నగరాన్ని దాటేశారా?

By:  Tupaki Desk   |   18 Jan 2025 5:30 AM GMT
అప్జల్ గంజ్ లో కాల్పులు జరిపిన పారిపోయనోళ్లు ఎక్కడ?
X

సంచలనంగా మారిన అఫ్జల్ గంజ్ కాల్పుల వ్యవహారం ఇప్పటికి మిస్టరీగానే మిగిలింది. బీదర్ లో ఎటీఎం వద్ద కాల్పులు జరిపి.. ఒక ప్రాణాన్ని బలి తీసుకున్న దుండగులు హైదరాబాద్ రావటం.. ప్రైవేటు ట్రావెల్స్ వద్ద వారిని గుర్తించిన వేళ.. కాల్పులు జరిపి పారిపోవటం తెలిసిందే. అయితే.. పోలీసులు వెంటనే స్పందించి భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించినప్పటికి వారి ఆచూకీ లభించలేదు. ఈ మిస్టరీ ఇప్పుడు హైదరాబాద్ పోలీసులకు సవాలుగా మారింది. ప్రాథమికంగా లభించిన ఆధారాల ప్రకారం చూస్తే.. ఈ పని చేసింది బిహార్ కు చెందిన అమిత్ కుమార్ ముఠాగా భావిస్తున్నారు.

రోషన్ ట్రావెల్స్ బస్సులో అమిత్ కుమార్ పేరుతో టికెట్ బుక్ చేసుకున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు.. అందులో పేర్కొన్న ఫోన్ నెంబరు మాత్రం అతనిది కాదని తేల్చారు. ఆ నెంబర్ ను విశ్లేషించగా.. అది బిహార్ కు చెందినదిగా తేలింది. ఇదిలా ఉంటే అమిత్ కుమార్ గ్యాంగ్ మీద బిహార్ లో ఇప్పటికే పది హత్య కేసులు ఉన్నట్లుగా హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. నిందితుల్నిపట్టుకోవటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

బీదర్ లో ఎటీఎం సెంటర్ వద్ద కాల్పులు జరిపి.. భారీ ఎత్తున నగదును దోచుకెళ్లిన దుండగులు.. అక్కడి నుంచి తప్పించుకొని హైదరాబాద్ రావటం.. అఫ్జల్ గంజ్ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ లో ప్రయాణించేందుకు టికెట్ తీసుకోవటం తెలిసిందే. అయితే.. లగేజ్ ను చెక్ చేసే క్రమంలో భారీగా నోట్ల కట్టలు కనిపించటంతో అనుమానించగా.. ట్రావెల్ సిబ్బందిపై కాల్పులు జరిపి బస్సులో నుంచి దూకి పారిపోవటం తెలిసిందే.

ఇలా పారిపోయిన వారు స్వీకార్ హోటల్ వద్ద ఆటో ఎక్కి సిద్దంబర్ బజార్.. ఎంజే మార్కెట్.. ట్యాంక్ బండ్ మీదుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వైపు పారిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమేరా ఫుటేజ్ ఆధారంగా గుర్తించిన అంశాల్ని పోలీసులు బయటకు పొక్కనీయటం లేదు. అయితే.. వారు ప్రయాణించిన ఆటోను గుర్తించి.. ఆటో డ్రైవర్ ను విచారించారు. ఈ సందర్భంగా ఆటోలో వారు ఏం మాట్లాడుకున్న విషయాల్ని పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఆ వివరాల్ని పోలీసులు వెల్లడించలేదు.

ఇప్పటివరకు చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. దుండగులు ట్రైన్ లో పారిపోయి ఉంటారా? లేదంటే రోడ్డు మార్గంలో నగరాన్ని దాటేశారా? ఇదేమీ కాకుండా పోలీసులను తప్పుదారి పట్టించేందుకు వీలుగా నగరంలోనే నక్కి ఉన్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాలంటూ నగరంలోని లాడ్జీలు.. హోటళ్లు.. వసతి గృహాలకు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దుండగుల్ని పట్టుకోవాలన్న పట్టుదలతో హైదరాబాద్ పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది.