Begin typing your search above and press return to search.

మళ్ళీ మోడీయే పీఎం....ఇది దేశీయ సర్వే కాదు...!

నరేంద్ర మోడీ మూడవసారి ప్రధాని అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ పత్రిక కధనంగా ఉంది.

By:  Tupaki Desk   |   1 Jan 2024 4:30 PM GMT
మళ్ళీ మోడీయే పీఎం....ఇది దేశీయ సర్వే కాదు...!
X

దేశంలో ఎన్నికలు జరగడమే తరువాయి మోడీ మరోసారి ప్రధాని అవుతారు అని కచ్చితంగా చెబుతూ ఒక వార్త వచ్చింది. అయితే ఇది దేశీయ సర్వే కాదు. ఆస్థాన పండితులు చెప్పే జోస్యం అంతకంటే కాదు, దేశం కాని దేశం యూకేకి చెందిన గార్డియన్ పత్రిక మోడీ గురించి ఆయన విజయావకాశాల గురించి రాసుకొచ్చింది.

నరేంద్ర మోడీ మూడవసారి ప్రధాని అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ పత్రిక కధనంగా ఉంది. అది కూడా పెద్దగా శ్రమ లేకుండానే మోడీ అధికారంలోకి వస్తారు అని రాయడం విశేషం. మోడీ హ్యాట్రిక్ ప్రధాని కావడం తధ్యమని యూకే కాలమిస్ట్ హానా ఎల్లిస్ పీటర్స్ తన కధనం ద్వారా స్పష్టం చేశారు.

దానికి పీటర్స్ విశ్లేషించిన అనేక అంశాలు కూడా ఆలోచింపచేసేలా ఆసక్తిని పెంచేలా ఉన్నాయని చెప్పాలి. దేశంలో మోడీ ఇమేజ్ ఈ రోజుకీ చెక్కు చెదరలేదని పీటర్స్ రాసుకొచ్చారు. అంతే కాదు ఈ రోజుకీ జాతీయ స్థాయిలో మోడీని ఢీ కొట్టే విషయంలో ప్రత్యర్ధి పార్టీలు సన్నద్ధంగా లేవు అని చెప్పేశారు.

దానికి అనేక కారణాలు ఉన్నాయని అన్నారు. ఇక ఇటీవల సెమీ ఫైనల్స్ గా భావించిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కీలకమైన మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో బీజేపీ గెలిచి తన సత్తాను చాటుకుందని పీటర్స్ పేర్కొన్నారు.

అంతే కాదు 2014 తరువాత నుంచి చూసినపుడు జాతీయ స్థాయిలో పరిస్థితులు అన్నీ మోడీకి పూర్తిగా అనుకూలంగా మారాయని పీటర్స్ వెల్లడించడం విశేషం. మోడీకి బీజేపీకి ప్రత్యర్ధులు అన తగ్గ పార్టీలకు తూర్పు, పశ్చిమ భారత దేశంలో కొంత మేర మాత్రమే బలం ఉందని ఆ బలంతో వారు రేపటి రోజున మోడీని ఢీ కొట్టలేరు అని యూకే కాలమిస్ట్ తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు.

ఇండియా కూటమిగా ముందుకు వచ్చినా కూడా కాంగ్రెస్ తో అంతర్గత విభేదాలు ఎక్కువగానే ఉన్నాయని పీటర్స్ అంటున్నారు. పేరుకు ఇండియా కూటమి కట్టి ఒక గొడుగు కిందకు చేరినా కూడా కూటమిలోని ఆయా పార్టీల మధ్య ఇంకా అనేక కీలకమైన అంశాలలో ఏకాభిప్రాయం రావాల్సి ఉందని పీటర్స్ అంటున్నారు.

బీజేపీ విషయం అలా కాదని, ఇప్పటికే ప్రచార పర్వం లోకి దిగిపోయిందని పీటర్స్ వెల్లడించారు. మోడీ ఇమేజ్ తో పాటు హిందూత్వ, సంక్షేమ పధకాలు ఇవన్నీ కూడా బీజేపీని మరోసారి విజయపధంలో నడిపిస్తాయని పీటర్స్ పేర్కొనడం గమనార్హం.

ఇక దేశంలో ఉన్న నాయకులలో మోడీ బాహుబలిగా మారారు అని అభివర్ణించారు. హిందూత్వను దేశంలో రగిలించడమే కాదు దాన్ని తమకు అనుకూలంగా తిప్పుకోవడంలోనూ బీజేపీ విజయం సాధించింది అని తన కధనంలో పీటర్స్ వివరించే ప్రయత్నం చేశారు.

వీటితో పాటు సరిగ్గా ఎన్నికల వేళ అయోధ్యలో రామమందిరం ప్రారంభం కచ్చితంగా బీజేపీ విజయాలను మరో మెట్టుకు చేరుస్తుంది అని పీటర్స్ విశ్లేషించారు. ఈసారి కూడా హిందువుల ఓట్లను గంపగుత్తగా తన వైపునకు తిప్పుకోవడంతో బీజేపీ ఘనవిజయం సాధించడం ఖాయమని ఆ పత్రిక కధనం సాగింది. ఇవన్నీ చూసినపుడు దేశంలో సర్వేలు జోస్యాలు ఎటూ మోడీకే ఓటు వేస్తున్నాయి. విదేశీ పత్రికలు, ఆ కధనాలు కూడా మోడీకి జై కొట్టడమే ఇపుడు ఆసక్తిని పెంచుతోంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ పత్రికా కధనం దేశంలో ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ పార్టీల మధ్య చర్చకు తావిస్తూ సంచనలం గా మారుతోంది.