Begin typing your search above and press return to search.

చెన్నై ప్రైవేట్ సంస్థకు చెందిన అగ్నిబాన్ రాకెట్ ప్రత్యేకతలివే

అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ గా పేరున్న ఈ ప్రైవేటు అంతరిక్ష్ సంస్థ తాజాగా అగ్నిబాన్ ఎస్ఓఆర్ టీఈడీ మిషన్ 01 అనే చిన్న తరహా రాకెట్ ను ప్రయోగిస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 April 2024 4:34 AM GMT
చెన్నై ప్రైవేట్ సంస్థకు చెందిన అగ్నిబాన్ రాకెట్ ప్రత్యేకతలివే
X

చెన్నైకు చెందిన ఒక ప్రైవేటు సంస్థ తాజాగా నిర్వహిస్తున్న చిన్న తరహా రాకెట్ ప్రయోగం అందరిని ఆకర్షిస్తోంది. అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ గా పేరున్న ఈ ప్రైవేటు అంతరిక్ష్ సంస్థ తాజాగా అగ్నిబాన్ ఎస్ఓఆర్ టీఈడీ మిషన్ 01 అనే చిన్న తరహా రాకెట్ ను ప్రయోగిస్తున్నారు. దీనికి సూళ్లూరుపేట దగ్గర్లోని షార్ కేంద్రం వేదికగా మారింది. షార్ లోని అగ్నికుల్ ప్రయోగవేదిక నుంచి దీన్ని ఈ ఉదయం (శనివారం) ప్రయోగించారు.

ఇస్రోలోని కమర్షియల్ విభాగమైన ఇన్ స్పేస్ సంస్థ ఆహ్వానంతో షార్ లోని సౌండింగ్ రాకెట్ లాంచ్ పాడ్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. శుక్రవారం అర్థరాత్రి పన్నెండు గంటలకు మొదలైన కౌంట్ డౌన్ ఉదయం పూర్తైంది. షెడ్యూల్ లో భాగంగా దీన్ని ప్రయోగించారు. ఈ ప్రయోగంలో భాగంగా సుమారు 100 కేజీల బరువున్న ఉపగ్రహాన్ని లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి పంపేలా ఏర్పాట్లు చేశారు. ప్రైవేట్ సంస్థకు చెందిన రాకెట్ ప్రయోగం కావటంతో పూర్తి వివరాల్ని వెల్లడించలేదు.

ఈ రాకెట్ ప్రత్యేకత ఏమంటే.. పేటెంట్ పొందిన అగ్నిలెట్ ఇంజిన్ తో దీన్ని నడపటమే. త్రీడీ ప్రింటెడ్ 6 కేఎన్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ సాయంతో దీన్ని ప్రయోగించారు. అగ్నికుల్ రాకెట్ 18 మీటర్ల ఎత్తు ఉండగా.. 1.3 మీటర్ల వెడల్పు ఉంది. ప్రయోగ సమయంలో దీని బరువు 14వేల కేజీలుగా ఉంటుంది.

ఈ అగ్నిలెట్ ఇంజిన్లలో లిక్విడ్ ఆక్సిజన్.. లిక్విడ్ ఆక్సిడైజర్ అనే ఇంధనం సాయంతో మూడు దశల్లో రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించారు. గత ఏడాది ఆగస్టు 15న ఈ సంస్థ ఒక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయగా.. తాజాగా మరోసారి ప్రయోగాన్ని చేపట్టింది.