తెలంగాణాలో ఎవరూ ఊహించని ప్రభుత్వం ?
అపుడు బీజేపీ తన మద్దతుని బీయారెస్ కి ఇవ్వడం ద్వారా సంకీర్ణ ప్రభుత్వానికి బాటలు వేస్తుంది అని అంటున్నారు.
By: Tupaki Desk | 14 Oct 2023 8:30 AM GMTతెలంగాణాలో హంగ్ వస్తుందా అంటే ఏమో రాజకీయాల్లో ఏది ఎలా జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. 2014లో టీయారెస్ కి మ్యాజిక్ ఫిగర్ కంటే ఒకటి రెండు సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. ఆ తరువాత ఇతర పార్టీలను చేర్చుకుని బీయారెస్ బలపడింది. 2018 నాటికల్లా గ్రాస్ రూట్ లెవెల్ లో పాతుకునిపోయి సొంతంగా దాదాపుగా తొంబై సీట్లను సాధించి తిరుగులేదు అనిపించుకుంది.
అయితే ఈసారి మాత్రం తెలంగాణాలో బీయారెస్ గెలవడం అన్నది అంత సులువు కాదు అని అంటున్నారు. ఈ మాట చెప్పడానికి రాజకీయ జోతీష్యం కూడా అవసరం లేదు అని అంటున్నారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మీద కచ్చితంగా భారీ ఎత్తున యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. దాంతో కేసీయార్ పార్టీ ఇపుడు ఏటికి ఎదురీదుతోంది అని అంటున్నారు.
ఇక కాంగ్రెస్ విషయం తీసుకుంటే గ్రాఫ్ గత నాలుగైదు నెలలుగా బాగా మారింది. దాంతో చాలా ముందుకు వచ్చింది. అదే టైం లో ఇది గెలుపు తీరాలకు చేర్చే సీన్ ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. కాంగ్రెస్ ఈ ఇంతటి కీలక సమయంలో కూడా సీనియర్లు తలో విధంగా వ్యవహరిస్తున్నారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ ఏకంగా పార్టీని వీడారు.
ఆయన్ని సపోర్ట్ చేస్తూ మరో సీనియర్ వీ హనుమంతరావు విమర్శలు సొంత పార్టీ మీదనే సంధించారు. ఇక చాలా మంది లోలోపల రగులుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి అపుడే వచ్చేసినట్లుగా భావిస్తూ సీఎం రేసులోకి వచ్చేస్తున్నారు. స్వతహాగా పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డికి చాన్స్ ఉంటుంది. దాంతో ఆయన మీదనే గురి పెడుతున్నారు. ఇలా కాంగ్రెస్ కి వస్తున్న ఆదరణను సొమ్ము చేసుకోవడంలో ఆ పార్టీ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది.
ఇంకో వైపు చూస్తే బీజేపీ నిన్నటిదాకా బోర విడుచుకుని మాదే ప్రభుత్వం అన్నది. ఇపుడు మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఆ పార్టీ నేత బీఎల్ సంతోష్ అయితే తాము అధికారంలోకి ఏదో విధంగా వస్తామని అంటున్నారు. తెలంగాణాలో హంగ్ వస్తే కింగ్ మేకర్ గా అవతరిస్తామని అంటున్నారు. అంటే బీజేపీ ప్లాన్ అర్ధం అవుతోంది కదా. కచ్చితంగా పదిహేను దాకా సీట్లను సంపాదించుకుంటే తెలంగాణాలో హంగ్ తప్పదని బీజేపీ భావిస్తోంది.
ఆ మేరకు ఎఫ్ఫెర్ట్ అంతా పెడుతోంది. తెలంగాణాలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. ఇందులో ఏడు నుంచి తొమ్మిది దాకా మజ్లీస్ కి పోతాయి. ఇక మిగిలిన 110 సీట్లలో బీజేపీ 15 నుంచి ఇరవై సీట్ల మీద కన్నేసింది. అందులో పదిహేను కనుక బీజేపీ గెలిస్తే తెలంగాణాలో హంగ్ తప్పదని అంటున్నారు. అదేలా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బీయారెస్ గెలిచే సీట్లు 45 కి తగ్గవని అంటున్నారు. అంటే అపుడు కాంగ్రెస్ కూడా 45 నుంచి 50 సీట్ల మధ్యనే వస్తాయని అంటున్నారు. అరవై సీట్లు ఎవరికి వస్తే వారిదే అధికారం అవుతుంది.
అపుడు బీజేపీ తన మద్దతుని బీయారెస్ కి ఇవ్వడం ద్వారా సంకీర్ణ ప్రభుత్వానికి బాటలు వేస్తుంది అని అంటున్నారు. అయితే బీయారెస్ కి కూడా ఈసారి గడ్డు పరిస్థితి ఉందని తెలుసు అంటున్నారు. దాంతో తమ మిత్ర పక్షం అయిన మజ్లీస్ మద్దతుతో ఎలాగైనా 50కి పైగా సీట్లను సాదిస్తే ఆ తక్కువ పడిన సీట్లను కాంగ్రెస్ ని చీల్చి అయినా తెచ్చుకోవాలని చూస్తోందని అంటున్నారు. అందుకే ఇప్పటి నుంచే కాంగ్రెస్ లో గెలిచే క్యాండిడేట్ల మీద ఫోకస్ పెట్టి వారికి ఆర్ధికంగా సాయం చేస్తూ కొత్త మిత్రులను శత్రు కూటమి నుంచి పెంచుకునే ఎత్తుగడకు దిగితోంది అంటున్నారు.
ఎవరు ఏ ఎత్తులు వేసినా ఈసారి బీయారెస్ తో బీజేపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అని అంటున్నారు. తెలంగాణా అధికారంలో వాటాను సంపాదించడం ద్వారా తమ కోరికను కొంత తీర్చుకుంటూ బీయారెస్ ఎంపీల మద్దతుని కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో పొందాలని బీజేపీ పెద్దలు భారీ వ్యూహాన్నే రచిస్తున్నారు అని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో హంగ్ వస్తే కనుక మజ్లీస్ పాత్ర చాలా కీలకం అంటున్నారు. ఎందుకంటే బీజేపీ ఉంటే ఆ పార్టీ ఉండదు, అపుడు కాంగ్రెస్ వైపు టర్న్ అయితే టోటల్ రాజకీయం మారిపోతుంది అని అంటున్నారు.