Begin typing your search above and press return to search.

కొంప ముంచేస్తున్న ‘దూకుడు’!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో నేత‌లు చేస్తున్న ప్ర‌చారాలు వివాదాల‌కు దారితీస్తున్నాయి.

By:  Tupaki Desk   |   27 Nov 2023 8:58 AM GMT
కొంప ముంచేస్తున్న ‘దూకుడు’!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో నేత‌లు చేస్తున్న ప్ర‌చారాలు వివాదాల‌కు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అదికార పార్టీ బీఆర్ఎస్‌కు వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల్సిన బీఆర్ ఎస్ అగ్ర‌నేత‌లు.. కొంత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతో ప‌రిస్థితి చేజారుతోందనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి ఎన్నిక‌ లన్నాక దూకుడు ఉంటుంది. ఉండాలి కూడా. అయితే.. అది కొంత వ‌రకే ప‌రిమితం కావాలి.

కానీ, మితిమీరిన అత్యుత్సాహం.. త‌మ‌కు ఎదురులేద‌నే భావన వంటివి తిప్పలు తెస్తున్నాయి. రెండు రోజుల కింద‌ట ఏకంగా.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ను హెచ్చ‌రిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపింది. ఏకంగా పార్టీని మూసేయాల్సి ఉంటుంద‌ని వార్నింగ్ ఇచ్చింది. ఈ విష‌యాన్ని మ‌రిచిపోయే లోపే.. సీఎం కేసీఆర్ త‌న‌యుడు, కేటీఆర్ ను వివ‌ర‌ణ కోరుతూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాఖీదు పంపించింది.

ఇక‌, ఇప్పుడు తాజాగా కేటీఆర్ మేన‌ల్లుడు, మంత్రి హ‌రీష్‌రావు ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానిస్తూ.. కీల‌క మైన రైతు బంధు ప‌థ‌కం నిధుల విడుద‌ల‌ను ఎన్నిక‌ల సంఘం ఆపేసింది. పై రెండు ఘ‌ట‌న‌ల కంటే.. తాజాగా ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌య‌మే.. ఇప్పుడు బీఆర్ ఎస్ ద‌డ పెట్టేస్తోంది. హోరా హోరీ పోరు నేప‌థ్యంలో ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకోవాల‌నే ఏకైక ల‌క్ష్యంతో నాయ‌కులు ముందుకు సాగుతున్నారే త‌ప్ప‌.. త‌ర్వాత ప‌రిణామాలను వారు అంచ‌నా వేయ‌లేక‌పోతున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

హ‌రీష్ ఎఫెక్ట్ ఇప్పుడు బీఆర్ ఎస్‌కు శ‌రాఘాతంగా మారింది. ఇటీవ‌ల ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాట్లాడుతూ.. ``మంగ‌ళ‌వారం(ఈనెల 28) పొద్దుగాల చాయ్ తాగుతుండే పాటికే.. మీఫోన్ల‌ల్ల టింగు టింగు మ‌ని రైతు బంధు మోగుద్ది`` అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌పైనే కాంగ్రెస్ నేత‌లు ఫిర్యాదు చేశారు. వీటినే ఈసీ కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ట్టు పేర్కొంది. మొత్తానికి నాయ‌కుల దూకుడు కీల‌క ఎన్నిక‌ల సమ‌యంలో ఇబ్బందిగా మార‌డం గ‌మ‌నార్హం.