ఎట్టకేలకు ఆ భారీ కుంభకోణంలో కదలిక!
మరోవైపు అగ్రిగోల్డ్ వ్యవహారంపై కోర్టుల్లో కేసులు కూడా నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లో డిపాజిట్ దారులు కేసులు పెట్టారు
By: Tupaki Desk | 7 Sep 2023 6:00 AM GMTడిపాజిట్ చేస్తే అధిక వడ్డీలు ఇస్తామని ఆశచూపి డిపాజిటర్లను నిలువునా ముంచినా అగ్రిగోల్డ్ ఉదంతం గతంలో దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో అధిక వడ్డీల ఆశచూపి అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిట్లు కట్టించింది. ఇది నిజమేనని నమ్మిన 32 లక్షల మంది డిపాజిట్లు చేశారు. వీరి నుంచి డిపాజిట్ల రూపంలో ఏకంగా రూ.6,380 కోట్లు సేకరించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం అనేక ఆస్తులు కొనుగోలు చేసుకుంది. ఆ తర్వాత పత్తా లేకుండా బిచాణా ఎత్తేసింది.
అగ్రిగోల్డ్ డిపాజిటదార్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదుకోలేదు. సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ముందుగా రూ.10 వేలు, రూ.20 వేలు డిపాజిట్లు చేసినవారికి నగదు చెల్లించారు. మిగిలినవారికి ఇంకా ఇవ్వకపోవడంతో వారంతా కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు.
మరోవైపు అగ్రిగోల్డ్ వ్యవహారంపై కోర్టుల్లో కేసులు కూడా నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లో డిపాజిట్ దారులు కేసులు పెట్టారు. ఈ కేసులన్నింటిని ఏపీ హైకోర్టు ఉమ్మడిగా విచారణకు స్వీకరించింది. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి డిపాజిటదార్లకు నగదు చెల్లించాలని ఏపీ హైకోర్టు అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు అగ్రిగోల్డ్ కుంభకోణంలో నిధుల మళ్లింపు వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. కంపెనీ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమ సుందర వరప్రసాద్ ను ఛార్జిషీట్ లో నిందితులుగా చేర్చింది. వారితో పాటు అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలనూ నిందితులుగా జాబితాలో పేర్కొంది.
ఛార్జిషీట్ లోని ఆరోపణలపై ప్రాథమికంగా సంతృప్తి చెందిన నాంపల్లిలోని ఈడీ ప్రత్యేక కోర్టు హోదా ఉన్న ఎంఎస్‌జే కోర్టు విచారణ నిమిత్తం చార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలో నిందితులకు సమన్లు జారీ చేసింది. వారందరినీ అక్టోబరు 3న హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
32 లక్షల మంది డిపాజిటర్లను రూ.6,380 కోట్ల మేర మోసం చేసిన వ్యవహారంపై ఏపీ సీఐడీ గతంలోనే అగ్రిగోల్డ్ యాజమాన్యంపై కేసులు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ.. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు జరిపి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో భాగంగా రూ.4,141 కోట్ల మేర ఆస్తులను జప్తు చేసింది. అయితే.. మరో 2000 కోట్లకు పైగా సొమ్ము ఏమైందో తేలాల్సి ఉంది.