50వ వివాహ వార్షికోత్సవం... "విడాకుల రాజధాని"లో సరికొత్త రికార్డ్!
తాజాగా ఓ జంట గతంలో ఎన్నడూ లేని సరికొత్త ఆ రికార్డ్ నే నెలకొల్పారు.. ఆ అద్భుతాన్నే సృష్టించారు.
By: Tupaki Desk | 21 July 2024 3:00 AM GMTభారత్ వంటి దేశాల్లో వివాహం అయ్యి 50వ వార్షికోత్సవం చేసుకోవడం అత్యంత సాధారణ విషయమనే చెప్పాలి. అయితే... నైజీరియాలోని కానో నగరంలో మాత్రం అదొక అద్భుతం.. అదొక రికార్డ్. తాజాగా ఓ జంట గతంలో ఎన్నడూ లేని సరికొత్త ఆ రికార్డ్ నే నెలకొల్పారు.. ఆ అద్భుతాన్నే సృష్టించారు. దీంతో.. ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అవును... నైజీరియాలోని కానో నగరాన్ని "విడాకుల రాజధాని"గా పిలుస్తారు. కారణం... ఇక్కడ విడాకులు తీసుకోవడం అతిచిన్న విషయం. ఫోన్ లో మెసేజ్ పెట్టి కూడా విడిపోతుంటారు. అలాంటి నగరంలో ఇటీవలే ఓ జంట 50వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొంది. ఇద్దరి మధ్య వివాహ బంధం ఇంత సుదీర్ఘ కాలం నిలవడం అక్కడ ఇదే తొలిసారి.
వివరాళ్లోకి వెళ్తే... 76 ఏళ్ల మహమూద్ కబీర్ యకసయ్, 60 ఏళ్లు దాటిన రబియాతు తాహిర్ లు ఇటీవల 50వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన వారు తమ బంధం వెనుక ఉన్న రహస్యాన్ని వెళ్లడించారు.. కానో నగరంలో ఇంత విచ్చల విడిగా విడాకులు ఎందుకు ఉంటాయో చెప్పే ప్రయత్నం చేశారు!
ఇందులో భాగంగా... ఆమె చాలా నిస్వార్థమైన వ్యక్తి అని.. తమ వివాహ బంధం ఇంత సుదీర్ఘ కాలం ఆనందంగా కొనసాగడంలో ఆమెదే కీలక పాత్ర అని యకసయ్ చెబుతుండగా... ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ప్రశాంతంగా ఉండే మనస్తత్వం తన భర్తది అని.. అతను అత్యంత సహనశీలి అని తాహిర్ చెబుతున్నారు.
ఇదే సమయంలో.. ఒకరినొకరం నిస్వార్థంగా ప్రేమించుకుంటామని.. పరస్పరం గౌరవించుకుంటామని.. సహచర్యాన్ని ఆనందిస్తామని వీరిద్దరూ కలిసి చెబుతున్నారు. వీరు 13 మంది సంతానాన్ని కలిగి ఉన్నారు!
కాగా... 1990లో విడాకుల రేటు పెరిగడంతో కానోకి "విడాకుల నగరం" అని పేరు పడిపోయింది. అప్పటి నుంచీ ఆ పేరును తొలగించుకోలేకపోయింది. ఈ నగరంలో మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలోనే సుమారు 32% వివాహాలు విడాకులతో ముగిసిపోతుంటాయని 2022 లోని ఓ పరిశోధనలో తేలిందని అంటారు!