మోడీకి భారీ సెగ.. 80 కోట్ల మంది డేటా లీక్.. ఎగిసి పడుతున్న రాజకీయ మంటలు!
ఉన్నతస్థాయి అధికారులను రంగంలోకి దింపడమే కాకుండా.. అసలు ఎలా డేటా లీకైందనే వివరాలపై ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమీక్షలు చేస్తున్నారు.
By: Tupaki Desk | 31 Oct 2023 2:30 PM GMTదేశంలోని పౌరులకు సంబంధించిన ఆధార్, పాన్ సహా ఇతర కీలక వ్యక్తిగత వివరాలతో కూడిన డేటా లీక్ అయిపోయింది. ఏకంగా 81.5 కోట్ల మంది ప్రజల డేటా ``డార్క్ వెబ్``కు చేరిపోయినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది దేశ చరిత్రలోనే మరోమాటలో చెప్పాలంటే.. ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద అంశంగా చెబుతున్నారు. డేటాలీక్ అయిన విషయం బయటకు పొక్కగానే ప్రతిపక్షాలు మోడీ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నాయి.
ప్రజల వ్యక్తిగత వివరాల భద్రత గాలిలో దీపంగా మారిందని.. ప్రజల రక్షణకు ఎవరు బాధ్యత వహిస్తారని కాంగ్రెస్ నాయకులు నిలదీస్తున్నారు. ఇక, ఈ పరిణామాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. ఉన్నతస్థాయి అధికారులను రంగంలోకి దింపడమే కాకుండా.. అసలు ఎలా డేటా లీకైందనే వివరాలపై ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమీక్షలు చేస్తున్నారు. ఉన్న షెడ్యూల్‌ను కూడా కుదించుకుని ఆయన ఈ విషయంపైనే దృష్టి పెట్టారు.
అసలు ఏం జరిగింది?
దేశంలోని దాదాపు 81.5 కోట్ల మంది పౌరులకు చెందిన వ్యక్తిగత వివరాలతో కూడిన డేటా ఇప్పుడు డార్క్‌వెబ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. కొవిడ్-19 పరీక్షల సమయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి సేకరించిన డేటా చోరీకి గురైందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే.. ఇది ఎక్కడ నుంచి లీకైందనే విషయం మాత్రం కచ్చితంగా తెలియక పోవడం గమనార్హం. దీనిపై సీబీఐ దర్యాప్తును కూడా ఆదేశించినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
‘Pwn0001’ అనే హ్యాకర్ ఈ డేటాను డార్క్ వెబ్‌లో చూశాడు. అంతేకాదు.. ఈ డేటాను అతను ప్రదర్శించాడు కూడా. దీనిలో.. ఆధార్ కార్డ్, పాస్‌పోర్టుల సమాచారం, పేర్లు, ఫోన్ నంబర్లు, తాత్కాలిక, శాశ్వత చిరునామాలు ఉన్నాయి. ఈ నెల 9వ తేదీనే డేటా చౌర్యం ఘటన వెలుగు చూసినట్టు తెలిసింది. అయితే.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే.. తొలుత దీనిని అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ సంస్థ గుర్తించింది. Pwn0001 అనే వ్యక్తి పలు వేదికలపై తన వద్ద 81.5 కోట్ల మంది డేటా ఉందని.. వీటిల్లో భారతీయుల ఆధార్-పాస్‌పోర్టు సమాచారం ఉందని చెబుతున్న విషయాన్ని ఈ సంస్థ గుర్తు చేసింది. వీటిల్లో వాస్తవాలను గుర్తించేందుకు కొన్నింటిని ఆధార్ వెరిఫికేషన్ ద్వారా చెక్ చేశారు. అదంతా నిజమైన డేటానే అని నిర్ధారించుకొన్నారు.
ఈ లీకేజీపై ది కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సీఈఆర్‌టీ-ఐఎన్) తక్షణమే ఐసీఎంఆర్‌ను అప్రమత్తం చేసింది. అయితే.. ఇంత జరుగుతున్న కేంద్ర ఐటీ శాఖ ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించలేదు. ఈ పరిణామాలపైనే విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. మరి మోడీ ఏం చేస్తారో చూడాలి.